టీ 20 ప్రపంచకప్ ఇండియా వర్సెస్ పాక్ మ్యాచ్ లో ఇండియా అద్భుత విజయాన్నిసాధించింది. టాస్ ఓడిపోయిన టీమ్ ఇండియా మొదట బ్యాటింగ్ పేరారంభించింది. ఎప్పటిలాగే విరాట్ కొహ్లీ (4) వెంటనే అయిపోయాడు. తర్వాత రోహిత్ శర్మ కాపాడతాడని అనుకుంటే తను ఒక సిక్స్, ఒక ఫోర్ కొట్టి 13 పరుగులు చేసి ఔట్ అయిపోయాడు. 2 కీలకమైన వికెట్లు పడిపోవడంతో పంత్ కి సపోర్ట్ గా ప్రమోషన్ పై ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ వచ్చాడు. తను ఆ పరిస్థితుల్లో నిజం చెప్పాలంటే న్యాయం చేశాడు. ఒక సిక్స్, 2 ఫోర్ల సాయంతో 20 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. ఇక రిషబ్ పంత్ కి వరుసగా 4 లైఫ్స్ వచ్చాయి. అవి లేకపోతే టీమ్ ఇండియా ఈ మాత్రం స్కోరు కూడా చేసేది కాదు. మొత్తానికి పంత్ 31 బంతుల్లో 6 ఫోర్లతో 42 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. తనదే టీమ్ ఇండియాలో హయ్యస్ట్ స్కోరు అని చెప్పాలి. సూర్యకుమార్ యాదవ్ (7), శివమ్ దుబె (3), రవీంద్ర జడేజా (0) డిఫెన్స్ షాట్లు ఆడి వికెట్లు పారేసుకున్నారు. అది దురద్రష్టం అని చెప్పాలి. ఇక చివర్లో అర్షదీప్ సింగ్ (9) రన్ ఔట్ అయిపోయాడు. రెండు, ఏవో సిక్స్ లు కొడతాడనుకున్న హార్దిక్ పాండ్యా (7) లాంగ్ ఆన్ లో దొరికి పోయాడు. చివర్లో సిరాజ్ (7) నాటౌట్ గా నిలిచాడు. ఎట్టకేలకు 19 ఓవర్లలో 119 పరుగులకి ఆలౌట్ అయిపోయింది. పాకిస్థాన్ బౌలింగ్ లో " షాహిన్ ఆఫ్రిది 1, నసీం షా 3, మొహమ్మద్ అమీర్ 2, హరీష్ రౌఫ్ 3, వికెట్లు తీసుకుకున్నారు".
120 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన పాకిస్తాన్ ఓపెనర్లు బాబర్ అజామ్, రిజ్వాన్ ఇద్దరూ అద్భుతంగా ప్రారంభించారు. బూమ్రా 4వ ఓవర్ లో మరి రోహిత్ శర్మ ఏం చెప్పాడో తెలీదు కానీ బూమ్రా బాల్స్ అలాగే వేశాడు. సరిగ్గా నాలుగో బంతిని బాబర్ అజామ్ (13) స్లిప్ లోకి ఆడాడు. అంతే సూర్య అద్భుతంగా క్యాచ్ తీసుకున్నాడు. తర్వాత ఉస్మాన్ ఖాన్ (13)కి వికెట్ల ముందు ఎల్బీడబ్ల్యూగా ఔట్ అయ్యాడు. కానీ రిజ్వాన్ నిలబడ్డాడు. అతనికి సపోర్ట్ గా ఫకర్ జమాన్ వచ్చాడు. అయితే అతన్ని హార్దిక్ పాండ్యా అవుట్ చేశాడు. 13 పరుగులు చేసి తను నిరాశగా క్రీజు వదిలాడు. 14 ఓవర్లు గడిచాయి. పాక్ స్కోరు 80 పరుగులతో ఉంది. ఇంకా 36 బాల్స్ ఉన్నాయి. విజయానికి 40 పరుగుల దూరంలో ఉంది. అటు వైపు రిజ్వాన్ నాటౌట్ గా ఉన్నాడు. ఆ సమయంలో బుమ్రా ని తీసుకొచ్చాడు కెప్టెన్ రోహిత్ శర్మ అదే ఓవర్ లో బుమ్రా రిజ్వాన్ వికెట్ తీయగా స్టేడియం ఒక్కసారిగా హోరెత్తినదనే చెప్పాలి. ఈ పరిస్థితుల్లో పాక్ బ్యాటర్లు రన్స్ తీయడానికి చాలా ఇబ్బంది పడ్డారు. షాదబ్ ఖాన్ (4), ఇఫ్తికర్ అహ్మద్ (5), ఇలా త్వరత్వరగా ఔట్ అయిపోయారు. చివరికి విజయానికి 6 పరుగుల దూరంలో పాకిస్తాన్ ఆగిపోయింది. 7 వికెట్ల నష్టానికి 113 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో టీ 20 ప్రపంచకప్ లో టీమ్ ఇండియా మరో చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసుకుంది. " టీమ్ ఇండియా బౌలింగులో బూమ్రా 3, హార్దిక్ పాండ్యా 2, అర్షదీప్ 1, అక్షర్ పటేల్ 1 వికెట్లు పడగొట్టారు".