టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ బాటలోనే భారత ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా నడిచాడు. అంతర్జాతీయ టీ20 క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. టీ20 ప్రపంచకప్ 2024 టైటిల్ సాధించిన కొన్ని గంటల్లోనే ఈ నిర్ణయం తీసుకున్నాడు. కాగా ప్రపంచకప్ టైటిల్ గెలిచిన వెంటనే మాట్లాడిన విరాట్ కోహ్లీ.. టీ20లకు గుడ్‌బై చెప్పేశాడు. ఇక ట్రోఫీని ముద్దాడిన అనంతరం రోహిత్ శర్మ సైతం.. తాను ఇక భారత్ తరఫున టీ20లు ఆడబోనని చెప్పేశాడు. తాజాగా రవీంద్ర జడేజా సైతం టీ20 కెరీర్‌కు గుడ్‌బై చెప్పేశాడు. ఈ మేరకు తన నిర్ణయాన్ని ఇన్‌స్ట్రాగ్రామ్ వేదికగా వెల్లడించాడు.
“నేను మనస్ఫూర్తిగా అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు పలుకుతున్నా. నా దేశం కోసం నా అత్యుత్తమ ప్రదర్శననే చేశా. ఇతర ఫార్మాట్‌లలో (వన్డేలు, టెస్టులు) కెరీర్‌ను కొనసాగిస్తా.. అదే ప్రదర్శన చేస్తా. టీ20 ప్రపంచకప్ గెలవాలనే కల టీ20 ప్రపంచకప్ 2024తో నిజమైంది. ఇది నా అంతర్జాతీయ టీ20 కెరీర్‌లో గొప్ప ఘట్టం. నాకు మద్దతుగా నిలిచిన అభిమానులందరికీ ధన్యవాదాలు.” అని తన ఇన్ స్టాలో రవీంద్ర జడేజా రాసుకొచ్చాడు.
భారత్ తరఫున 2009న టీ20 క్రికెట్‌లో అడుగుపెట్టిన రవీంద్ర జడేజా.. ఇప్పటివరకు 74 అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లు ఆడాడు. అందులో 515 పరుగులు చేశాడు. 54 వికెట్లు పడగొట్టాడు. కాగా టీ20 ప్రపంచకప్ 2024 గెలిచిన భారత జట్టులో రవీంద్ర జడేజా కూడా సభ్యుడిగా ఉన్నాడు. ఫైనల్ మ్యాచ్ ముగిసిన వెంటనే భారత స్టార్ క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కూడా అంతర్జాతీయ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించగా.. కొన్ని గంటల తర్వాత జడేజా తన నిర్ణయాన్ని వెల్లడించాడు.
అయితే టెస్టులు, వన్డేలతో పోలిస్తే టీ20ల్లో రవీంద్ర జడేజా స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు. టీ20 ప్రపంచకప్ 2024లోనూ ఆశించిన మేర రాణించలేదు. రెండేళ్ల తర్వాత జరగనున్న టీ20 ప్రపంచకప్ కోసం యువ ఆటగాళ్లను తయారు చేయాలని టీమిండియా యాజమాన్యం భావిస్తోంది. ఈ నేపథ్యంలో కుర్రాళ్లకు అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో జడ్డూ టీ20ల నుంచి తప్పుకున్నాడు. కానీ వన్డేలు, టెస్టుల్లో మాత్రం భారత్ తరఫున మెరుగైన ప్రదర్శనను కొనసాగించేందుకు సిద్ధంగా ఉన్నట్లు జడేజా వెల్లడించాడు. ఐపీఎల్‌లోనూ అతడూ ఆడనున్నాడు. ఇక టీ20 ప్రపంచకప్ 2024 తర్వాత భారత్ ముగ్గురు ప్లేయర్ల సేవలను టీ20ల్లో కోల్పోయింది.