టీ20 వరల్డ్ కప్-2024 భారత్ ఛాంపియన్‌గా నిలిచింది. వన్డే వరల్డ్ కప్‌ను తృటిలో చేజార్చుకుని పగిలిన గుండెతో బరిలోకి దిగిన భారత ఆటగాళ్లు ఈసారి పొట్టికప్‌ను మిస్ చేయలేదు. టోర్నీ ఆద్యంతం విజయాలతో హోరెత్తిస్తూ జగజ్జేతగా నిలిచారు. అయితే ఫైనల్‌లో ఓ దశలో దక్షిణాఫ్రికా పైచేయి సాధించింది. కానీ అద్భుత పోరాటంతో అంతిమంగా విజేతగా నిలిచారు. ఆఖరి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్‌లో ఏడు పరుగుల తేడాతో నెగ్గారు.
కాగా, వరల్డ్ కప్ గెలిచిన అనంతరం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించారు. భవిష్యత్ తరాలకు అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో విజయానంతరం తమ నిర్ణయాన్ని వెల్లడించారు. అయితే టీ20ల్లో రోహిత్ స్థానాన్ని భర్తీ చేసే భారత్ కెప్టెన్ ఎవరనే చర్చ మొదలైంది. రో'హిట్' కెప్టెన్సీని కొనసాగించే వారసుడు ఎవరనే ఉత్కంఠ అందరిలో కొనసాగుతోంది.
మరికొన్నాళ్లలో రోహిత్ వన్డే, టెస్టులకు గుడ్‌బై పలికే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో నయా సారథిని భారత్ సిద్ధం చేసుకోవాల్సి ఉంది. అయితే రోహిత్‌కు స్టాండ్‌బై కెప్టెన్‌గా హార్దిక్ పాండ్య గత కొన్నాళ్లుగా చిన్నచిన్న సిరీస్‌లకు నాయకత్వం వహించాడు. కాగా, కెప్టెన్సీ రేసులో హార్దిక్‌తో పాటు జస్‌ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్ కూడా ఉన్నారు. రోహిత్, హార్దిక్ గైర్హాజరీలో బుమ్రా, సూర్య కూడా జట్టును నడిపించారు. ఈ నేపథ్యంలో హార్దిక్‌కు సారథి బాధ్యతలు దక్కుతాయా లేదా అనే విషయంపై స్పష్టత లేదు. అయితే భారత మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్.. హార్దిక్‌కు మద్దతు ఇవ్వలేదు.
టీ20ల్లో యువ ప్లేయర్ శుభ్‌మన్ గిల్‌కు టీమిండియా కెప్టెన్సీ అప్పగించాలని సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు. సీనియర్ క్రికెటర్లంతా టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనడంతో, జింబాబ్వే పర్యటనకు ఎంపిక చేసిన భారత జట్టుకు గిల్ కెప్టెన్సీ వహించనున్న విషయం తెలిసిందే. అయితే భవిష్యత్‌లో కూడా భారత రెగ్యులర్ కెప్టెన్‌గా రోహిత్ అనంతరం గిల్‌కే బాధ్యతలు ఇవ్వాలని సెహ్వాగ్ అన్నాడు.
''గిల్‌కు సుదీర్ఘంగా కెరీర్ ఉంది. అతను మూడు ఫార్మాట్లకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. గతేడాది గొప్పగా పరుగుల వరద పారించాడు. దురదృష్టవశాత్తు టీ20 వరల్డ్ కప్-2024కు దూరమయ్యాడు. నా పరంగా.. గిల్‌ను భారత కెప్టెన్‌గా చేయడమే సరైన నిర్ణయం. అన్ని ఫార్మాట్లకు రోహిత్ శర్మ గుడ్‌బై చెప్పిన వేళ సారథి స్థానాన్ని గిల్‌తో భర్తీ చేయాలి'' అని సెహ్వాగ్ పేర్కొన్నాడు.