టీ20 వరల్డ్ కప్-2024 ఛాంపియన్‌గా భారత్ అవతరించింది. ఫైనల్‌లో దక్షిణాఫ్రికాను చిత్తుచేసి 13 ఏళ్ల ప్రపంచకప్ నిరీక్షణకు టీమిండియా తెరదించింది. గెలుపు ఆశలు లేని స్థితి నుంచి అద్భుతంగా పోరాడి జగజ్జేతగా నిలిచింది. నరాలు తెగే ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో ఏడు పరుగుల తేడాతో విజయం సాధించింది.
మొదట భారత్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లకు 176 పరుగులు చేసింది. విరాట్ కోహ్లి (76; 59 బంతుల్లో, 6 ఫోర్లు, 2 సిక్సర్లు), అక్షర్ పటేల్ (47; 31 బంతుల్లో, 1 ఫోర్, 4 సిక్సర్లు) సత్తాచాటారు. మహరాజ్ (2/23), నోకియా (2/26) చెరో రెండు వికెట్లు తీశారు. అనంతరం ఛేదనలో దక్షిణాఫ్రికా ఎనిమిది వికెట్లకు 169 పరుగులు చేసింది. హెన్రిచ్ క్లాసెన్ (52; 27 బంతుల్లో, 2 ఫోర్లు, 5 సిక్సర్లు) పోరాడాడు. హార్దిక్ (3/20) మూడు వికెట్లు, బుమ్రా (2/18), అర్షదీప్ సింగ్ (2/20) చెరో రెండు వికెట్లతో విజృంభించారు.
అయితే ఫైనల్ అనంతరం స్టార్ క్రికెటర్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ టీ20 ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పారు. భవిష్యత్ తరానికి అవకాశం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. దశాబ్ద కాలం పాటు భారత విజయాల్లో ఈ ఇద్దరూ కీలక పాత్రను పోషించారు.అన్నిఫార్మాట్లలో భారత బ్యాటింగ్‌కు మూలస్తంభాలుగా సేవలు అందించారు. అలాంటి ఈ ఇద్దరు ఒకేసారి పొట్టి ఫార్మాట్‌కు గుడ్‌బై పలకడంతో ప్రపంచకప్ గెలిచిన ఆనందంతో పాటు తమ ఫేవరేట్ ప్లేయర్లను టీ20ల్లో చూడలేమనే బాధ అభిమానుల్లో వెంటాడుతోంది. కాగా, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి రిటైర్మెంట్ గురించి భారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ స్పందించాడు. ప్రపంచకప్ గెలిచిన అనంతరం వీడ్కోలు పలకడం కంటే మరో గొప్ప ముగింపు ఉండదని అన్నాడు. అయితే వన్డే, టెస్టు ఫార్మాట్‌లో వారిద్దరు మరికొన్నాళ్లు కొనసాగాలని అన్నాడు. వన్డే, సుదీర్ఘ ఫార్మాట్‌లో జట్టు విజయాల్లో తమ పాత్ర పోషించడం కొనసాగించాలని పేర్కొన్నాడు.
''వరల్డ్ కప్ గెలిచిన తర్వాత రోహిత్, కోహ్లి రిటైర్మెంట్ అయ్యారు. ఇంతకంటే గొప్ప ముగింపు కథ మరొకటి ఉండదు. అయితే టెస్టు, వన్డే ఫార్మాట్‌లలో వాళ్లు కొనసాగనున్నారు. ఈ ఫార్మాట్లలో దేశం కోసం, జట్టు కోసం కీలక పాత్రను కొనసాగిస్తారని ఆశిస్తున్నాను'' అని గంభీర్ అన్నాడు.