13 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. భారత్ జగజ్జేతగా నిలిచింది. సౌతాఫ్రికాతో జరిగిన టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌లో టీమిండియా ఏడు పరుగుల తేడాతో విజయం సాధించి ఛాంపియన్‌గా అవతరించింది. 2011 వన్డే వరల్డ్ కప్ అనంతరం జరిగిన ప్రతి ప్రపంచకప్‌లో భారత్ ఫేవరేట్‌గానే బరిలోకి దిగింది. కానీ సెమీఫైనల్స్, ఫైనల్స్‌లలో ఓటమిపాలై ట్రోఫీలను చేజార్చుకుంది.
కానీ గత పొరపాట్లను సరిదిద్దుకుని ఈ టీ20 వరల్డ్ కప్‌లో భారత్ చెలరేగింది. ఫైనల్‌లో ప్రత్యర్థి విజయానికి చేరువగా వెళ్లినా ఓటమిని అంగీకరించలేదు. అద్భుతంగా పోరాడి దక్షిణాఫ్రికాను చిత్తు చేసి కప్‌ను ముద్దాడింది. అనంతరం భారత ఆటగాళ్లంతా భావోద్వేగానికి లోనయ్యారు. ఆఖరి బంతిని విసిరిన హార్దిక్ అక్కడే మోకాళ్లపై కూర్చొని ఆనందభాష్ఫాలు కార్చాడు.
రోహిత్ శర్మ తన ఫీల్డింగ్ స్థానంలోనే పడుకుని నేలను గుద్దుతూ తన భారాన్ని దించుకున్నాడు. మరోవైపు విరాట్ కోహ్లి, మహ్మద్ సిరాజ్‌తో సహా మిగిలిన ఆటగాళ్ల కళ్లన్నీ తడిసిపోయాయి. ఎప్పుడూ కామ్‌గా ఉండే రాహుల్ ద్రవిడ్ కూడా బిగ్గరగా అరుస్తూ ఉద్వేగాన్ని భయటపెట్టాడు. అయితే వరల్డ్ కప్‌తో టీమ్ గ్రూప్ ఫొటో సమయంలో భారత ఆటగాళ్లు భిన్నంగా సెలబ్రేషన్స్ చేసుకున్నారు. రోహిత్ శర్మ డ్యాన్స్ ఆకట్టుకుంది.
ప్రపంచకప్ ట్రోఫీ సాధించిన అనంతరం ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ తన జట్టుతో కలిసి చేసిన సెలబ్రేషన్స్‌ను ట్రై చేద్దామని రోహిత్‌కు కుల్‌దీప్ సూచించాడు. దానికి తగ్గట్లుగా హిట్‌మ్యాన్‌కు కుల్‌దీప్ స్టెప్పులు కూడా నేర్పించాడు. కానీ టాస్ సమయంలో కీలక విషయాలే మరిచిపోయే రోహిత్ ఆ సమయంలో స్టెప్పులు కూడా మరిచిపోయాడు. కాస్త అటు ఇటుగా మ్యానేజ్ చేస్తూ కుల్‌దీప్ నేర్పించిన సెలబ్రేషన్స్‌ను మొత్తంగా రోహిత్ చేశాడు. రోహిత్ ఫన్నీ డ్యాన్స్ చూసి ఆటగాళ్లంతా ఎంజాయ్ చేశారు.