టీ20 ప్రపంచకప్ 2024 ఫైనల్‌లో దక్షిణాఫ్రికాను ఓడించిన భారత్.. 11 ఏళ్ల తర్వాత ఐసీసీ ట్రోఫీని ముద్దాడింది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో ఏడు పరుగుల తేడాతో విజయం సాధించింది. ఓ దశలో దక్షిణాఫ్రికా చివరి 30 బంతుల్లో 30 పరుగులు అవసరమయ్యాయి. క్రీజులో ప్రమాదకర హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్ ఉండటంతో భారత్‌కు మరోసారి నిరాశ తప్పదని అంతా భావించారు. 2023 వన్డే ప్రపంచకప్ ఫైనల్ ఓటమి మూడ్‌లోకి ఫ్యాన్స్ వెళ్లడం ప్రారంభించారు. కానీ అక్కడి నుంచి అసలు ఆట మొదలైంది. అద్భుతంగా పోరాడిన భారత్.. చివరకు 7 వికెట్ల తేడాతో గెలుపొందింది.
చాలా ఏళ్ల తర్వాత టైటిల్ సాధించడంపై టీమిండియా ఆటగాళ్లతో పాటు ఫ్యాన్స్ కూడా భావోద్వేగానికి గురయ్యారు. రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా గ్రౌండ్‌లోనే ఏడ్చేశారు. విజయం ఖరారు కాగానే కెప్టెన్ రోహిత్ శర్మ గ్రౌండ్‌లోనే పడిపోయాడు. నేలను కొడుతూ తన సంతోషాన్ని వ్యక్త పరిచాడు. టీమిండియా ఆటగాళ్ల సెలబ్రేషన్స్ చూసి ఫ్యాన్స్ కళ్లు కూడా చెమ్మగిల్లాయి. ఏదో తెలియని భావోద్వేగానికి భారత ప్రజలు లోనయ్యారు. ఈ సంతోషాన్ని మాటల్లో, పదాల్లో వర్ణించడం అసాధ్యం.
కాగా టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా స్టార్ స్పోర్ట్స్ ఛానెల్‌లో తెలుగు కామెంట్రీ చెబుతున్న వారు సైతం భావోద్వేగానికి లోనయ్యారు. ఓటమి తప్పదనుకున్న సమయం నుంచి దక్కిన విజయం కావడంతో కన్నీళ్లను ఆపుకోలేకపోయారు. భారత్ విజయానికి సమీపిస్తున్నప్పుడు ప్రతి బంతికి ఎగిరిగంతేశారు వ్యాఖ్యతలు. కామెంట్రీ బాక్స్‌లో ఉన్నారా.. స్టేడియంలో మ్యాచ్ చూస్తున్నారా అనేంతల పరిస్థితులు మారిపోయాయి. తెలుగు కామెంటేటర్లు.. కళ్యాణ్ కృష్ణ, వేణుగోపాల్ రావ్, సుమన్‌లు కామెంట్రీ బాక్సులో రచ్చ చేశారు. ఈ వీడియోలో ఓవైపు కామెంట్రీ చెబుతూనే.. మరోవైపు రచ్చ చేస్తూ కనిపించారు. భారత జట్టుపై తమకున్న అభిమానాన్ని ప్రదర్శించారు. పలువురు కామెంటేటర్లు రోహిత్ శర్మ కాళ్లకు నమస్కరించి తమ అభిమానాన్ని చాటుకోవడం విశేషం.