టీ20 వరల్డ్ కప్ గెలవడంతో.. ఐసీసీ ట్రోఫీ గెలవాలనే 11 ఏళ్ల టీమిండియా కల నెరవేరింది. 2007 తర్వాత మరోసారి టీ20 ప్రపంచ కప్ గెలిచిన భారత జట్టుకు బీసీసీఐ భారీ నజరానా ప్రకటించింది. ఏకంగా రూ.125 కోట్ల ప్రైజ్ మనీని అందించనున్నట్లు వెల్లడించింది. ఫైనల్లో సౌతాఫ్రికాతో జరిగిన ఉత్కంఠభరిత పోరులో గెలిచిన భారత క్రికెటర్లు.. హరికేన్ కారణంగా ఇంకా బార్బడోస్‌లో ఉండిపోయారు. తుఫాన్ తగ్గిన తర్వాత భారత గడ్డ మీద అడుగుపెట్టనున్న వారికి గ్రాండ్ వెల్‌కమ్ పలికే అవకాశం ఉంది.
అయితే టీ20 ప్రపంచ కప్ గెలిచిన తర్వాత భారత ఆటగాళ్లకు నజరానా ప్రకటించిన బీసీసీఐ సెక్రటరీ జై షా.. నెక్స్ట్ టార్గెట్‌ను కూడా ఫిక్స్ చేశారు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌తోపాటు ఛాంపియన్స్ ట్రోఫీని గెలవాలనే లక్ష్యాన్ని జై షా నిర్దేశించారు. టీ20 వరల్డ్ కప్ తర్వాత సీనియర్ ఆటగాళ్లయిన కోహ్లి, రోహిత్, జడేజా పొట్టి ఫార్మాట్ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఛాంపియన్స్ ట్రోఫీ, డబ్ల్యూటీసీల్లో సీనియర్ ప్లేయర్లు ఆడతారని బీసీసీఐ స్పష్టం చేసింది.
సీనియర్ ఆటగాళ్లు టీ20లకు మాత్రమే దూరం అవుతారని.. మిగతా రెండు ఫార్మాట్లలోనూ వారు ఆడతారని జై షా వెల్లడించారు. టీ20 వరల్డ్ కప్ గెలవడంలో కోహ్లి, రోహిత్ కీలక పాత్ర పోషించారంటూ.. సీనియర్ ప్లేయర్లపై జై షా ప్రశంసలు గుప్పించారు. ‘‘గత ఏడాది జరిగిన వన్డే వరల్డ్ కప్‌లో ఫైనల్ మినహా అన్ని మ్యాచ్‌లు గెలిచాం. ఫైనల్లో ఆస్ట్రేలియా మన కంటే మెరుగ్గా ఆడింది. అప్పుడు జట్టుకు నాయకత్వం వహించిన రోహిత్ సారథ్యంలోనే బార్బడోస్‌లో బరిలోకి దిగి గెలిచాం. ఈసారి మనం మరింత కష్టపడి, మెరుగ్గా ఆడి టైటిల్ గెలిచాం. ఇతర జట్లను పరిశీలిస్తే.. అనుభవం మనకు పనికొచ్చిందని చెప్పొచ్చు. రోహిత్ నుంచి కోహ్లి వరకు బాగా ఆడారు. ఇతర జట్లకు మనకు అనుభవమే తేడా. ప్రపంచ కప్ లాంటి మెగా టోర్నీల్లో అతిగా ప్రయోగాలు చేయలేం. ఆటకు ఎప్పుడు గుడ్ బై చెప్పాలనేది మంచి ఆటగాడికి బాగా తెలుసు. రోహిత్ స్ట్రైక్ రేట్ చాలా మంది యువ ఆటగాళ్ల కంటే మెరుగ్గా ఉంది’’ అని జై షా వ్యాఖ్యానించారు.
‘భారత్ ఇక నుంచి అన్ని టైటిళ్లు గెలవాలని కోరుకుంటున్నా. మన బెంచ్ కూడా ఎంతో బలంగా ఉంది. టీ20 వరల్డ్ కప్ గెలిచిన జట్టులోని ముగ్గురు ఆటగాళ్లు మాత్రమే జింబాబ్వే పర్యటనకు వెళ్తున్నారంటే మన బెంచ్ ఎంత బలంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అవసరమైతే మూడు జట్లను మనం బరిలోకి దింపగలం’ అని జై షా తెలిపారు.
2025 ఆరంభంలో ఛాంపియన్స్ ట్రోఫీ..
వచ్చే ఏడాది ఆరంభంలో ఛాంపియన్స్ ట్రోఫీ జరగనుంది. 2025 ఫిబ్రవరి నుంచి మార్చి 9 వరకు జరిగే ఈ ఐసీసీ ఈవెంట్‌కు పాకిస్థాన్ ఆతిథ్యం ఇవ్వాల్సి ఉంది. వన్డే ఫార్మాట్లో జరగనున్న ఈ టోర్నీలో ఐసీసీ ర్యాంకింగ్స్ ప్రకారం టాప్-8 జట్లు పాల్గొంటాయి. 2017లో చివరిసారి ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహించగా పాకిస్థాన్ విజేతగా నిలిచింది. 2017 తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహించొద్దని ఐసీసీ 2016లోనే నిర్ణయించింది. అయితే 2021లో మనసు మార్చుకున్న ఐసీసీ.. 2025 నుంచి ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహించనున్నట్లు ప్రకటించింది.
జూన్‌లో డబ్ల్యూటీసీ ఫైనల్:
2023-24 డబ్ల్యూటీసీ సైకిల్‌లో టాప్-2లో నిలిచిన జట్లు ఫైనల్లో తలపడతాయి. భారత్ ఇప్పటికే వరుసగా రెండుసార్లు ఐసీసీ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ చేరినప్పటికీ.. ఫైనల్స్‌లో మాత్రం విజయం సాధించలేకపోయింది. వచ్చే ఏడాది జూన్‌లో డబ్ల్యూటీసీ ఫైనల్ జరిగే అవకాశం ఉంది.