శనివారంతో ముగిసిన టీ20 ప్రపంచకప్ 2024లో భారత జట్టు ఛాంపియన్‌గా అవతరించిన విషయం తెలిసిందే. అయితే ఈ టోర్నీలో అద్భుత ప్రదర్శన కనబరిచిన 11 మంది ఆటగాళ్లతో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) జట్టును ప్రకటించింది. ఈ మేరకు జులై 1న అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. ఛాంపియన్‌గా నిలిచిన భారత జట్టు ప్లేయర్లే ఇందులో మెజార్టీ స్థానాలు సాధించడం గమనార్హం. 11 మందిలో ఏకంగా ఆరుగురు భారత ప్లేయర్లే ఉన్నారు. అయితే రన్నరప్‌గా నిలిచిన దక్షిణాఫ్రికా నుంచి ఒక్క ఆటగాడు కూడా 11 మందిలో లేకపోవడం గమనార్హం.
ఐసీసీ ప్రకటించిన 11 మంది ఆటగాళ్లలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్, అక్షర్ పటేల్, జస్‌ప్రీత్ బుమ్రా, అర్షదీప్ సింగ్‌లకు చోటు దక్కింది. అయితే టీ20 ప్రపంచకప్ 2024 ఫైనల్‌లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచుగా నిలిచిన విరాట్ కోహ్లీకి ఈ జాబితాలో చోటు దక్కలేదు. భారత ఆటగాళ్లతో పాటు అఫ్ఘానిస్థాన్ కెప్టెన్ రషీద్ ఖాన్, టోర్నీలో లీడింగ్ రన్ స్కోరర్‌గా ఉన్న ఆ జట్టు ఓపెనర్ రహ్మనుల్లా గుర్బాజ్, లీడింగ్ వికెట్ టేకర్ ఫజల్ హక్ ఫరూఖీలు ఉన్నారు. ఆస్ట్రేలియా నుంచి ఆల్ రౌండర్ మార్కస్ స్టోయినిస్, వెస్టిండీస్ నుంచి నికోలస్ పూరన్‌కు చోటు దక్కింది. 12వ ప్లేయర్‌గా దక్షిణాఫ్రికాకు చెందిన అన్రిచ్ నోర్జే ఎంపికయ్యాడు.
రోహిత్ శర్మ:
టీమిండియా కెప్టెన్ రోహిత్.. జట్టును ముందుండి నడిపించాడు. ఈ టోర్నీలో 8 మ్యాచులు ఆడిన హిట్‌మ్యాన్.. 257 పరుగులు చేశాడు. 156.7 స్ట్రైక్‌రేట్‌తో ఈ పరుగులు రాబట్టాడు. ఇందులో మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
సూర్యకుమార్ యాదవ్:
ఈ టోర్నీలో మొత్తంగా 8 మ్యాచులు ఆడిన సూర్యకుమార్ యాదవ్.. 199 పరుగులు చేశాడు. 135.37 స్ట్రైక్ రేటుతో ఈ పరుగులు నమోదు చేశాడు. అందులో రెండు హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి.
హార్దిక్ పాండ్యా:
ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా జట్టులో తన పాత్రకు న్యాయం చేశాడు. 8 మ్యాచుల్లో 144 రన్స్ చేసి, 1 వికెట్లు పడగొట్టాడు. బ్యాటింగ్‌లో 150కి పైగా స్ట్రైక్ రేటుతో ఈ పరుగులు రాబట్టడం గమనార్హం.
అక్షర్ పటేల్:
అక్షర్ పటేల్ కూడా బ్యాట్, బంతితో రాణించాడు. ఫైనల్ మ్యాచులో 47 పరుగులు చేసి.. జట్టుకు మెరుగైన స్కోరు అందించాడు. సెమీఫైనల్ మ్యాచులో ఇంగ్లాండ్‌పై 3 వికెట్ల పడగొట్టాడు. మొత్తంగా ఈ టోర్నీలో 92 పరుగులు చేసి, 9 వికెట్ల పడగొట్టాడు.
జస్‌ప్రీత్ బుమ్రా:
ఈ టోర్నీలో అద్భుతంగా రాణించిన బుమ్రా ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచాడు. 8 మ్యాచుల్లో 15 వికెట్లు పడగొట్టాడు. పొదుపుగా బౌలింగ్ చేసి.. ప్రత్యర్థి బ్యాటర్లను ఒత్తిడిలోకి నెట్టాడు. బుమ్రా ఈ టోర్నీలో 4.17 ఎకానమీ నమోదు చేయడం గమనార్హం.
అర్షదీప్ సింగ్:
భారత్ తరఫు అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా అర్షదీప్ నిలిచాడు. 8 మ్యాచుల్లో 17 వికెట్లు తీశాడు. జస్‌ప్రీత్ బుమ్రాతో కలిసి భారత జట్టుకు పవర్‌ప్లేలోనే వికెట్లు అందించాడు.