భారత అభిమానుల 11 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ టీమిండియా ఐసీసీ ట్రోఫీని గెలుపొందిన విషయం తెలిసింది. అమెరికా, వెస్టిండీస్ వేదికల్లో జరిగిన టీ20 ప్రపంచకప్ 2024 ఫైనల్‌లో దక్షిణాఫ్రికాను ఓడించిన భారత్.. ఈ ఫీట్ సాధించింది. దీంతో టీమిండియా ఆటగాళ్లకు ఘన స్వాగతం పలికేందుకు భారత్ సిద్ధమైంది. అందుకు ఏర్పాట్లు సైతం సాగుతున్నాయి. కానీ టీమిండియా ఫ్యాన్స్ ఆశలను వెస్టిండీస్‌లో ఉద్భవించిన "బెరిల్" హరికేన్ ఆలస్యం చేస్తోంది. తీవ్రమైన గాలులతో ఉష్ణమండల ప్రాంతాల్లో సంభవించే తుపానులను హరికేన్ అంటారు.
టీ20 ప్రపంచకప్ 2024 ఫైనల్ బార్బడోస్ వేదికగా జరిగింది. ప్రస్తుతం టీమిండియా ఆటగాళ్లు అక్కడే ఉన్నారు. షెడ్యూల్ ప్రకారం టీమిండియా ఆటగాళ్లు జులై 1న ఉదయం 11 గంటల వరకు భారత్‌లో ల్యాండ్ కావాల్సి ఉంది. తొలుత బార్బడోస్ నుంచి న్యూయార్క్‌కు అక్కడి నుంచి దుబాయ్ మీదుగా దిల్లీలో భారత ప్లేయర్లు దిగాల్సి ఉంది. కానీ "బెరిల్" హరికేన్ భారత జట్టు ప్రణాళికలను దెబ్బతీసింది. రెండో ప్రమాద హెచ్చరికలను జారీ చేసిన వెస్టిండీస్ అధికారులు.. ప్రజలెవరూ బయటకు రావొద్దని సూచించారు! ప్రస్తుతం అక్కడ గరిష్టంగా 210 కి.మీ వేగంతో గాలులు వీస్తున్నాయి. ఫలితంగా ఎయిర్‌పోర్ట్‌లలో రాకపోకలను నిలిపివేశారు. ఈ నేపథ్యంలో టీమిండియా ఆటగాళ్లు హోటల్ గదులకే పరిమితం అయ్యారు.
వాస్తవానికి ఎమిరేట్ ఫ్లైట్‌లో భారత ఆటగాళ్ల ప్రయాణం చేసేలా షెడ్యూల్ చేశారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అది సాధ్యమయ్యేలా కన్పించడం లేదు. దీంతో బీసీసీఐ టీమిండియా ప్లేయర్ల కోసం ప్రత్యేక ఛార్టర్ ఫ్లైట్‌ను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఆ ఫ్లైట్ నేరుగా దిల్లీలో ల్యాండ్ అయ్యేలా అధికారులు ప్రణాళికలు వేస్తున్నారు! భారత గడ్డపై అడుగుపెట్టిన తర్వాత టీమిండియా ఆటగాళ్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
కాగా మొత్తంగా టీమిండియా ప్లేయర్లు, వారి కుటుంబ సభ్యులు, కోచింగ్ స్టాఫ్, అధికారులు ఇలా అందరూ కలిపి 70 మంది ఉన్నట్లు తెలుస్తోంది. వారందరి కోసం ప్రత్యేక ఛార్టర్ ఫ్లైట్ బుక్ చేయాలని బీసీసీఐ భావిస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాదా దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్‌లో భారత్ 7 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఫైనల్‌లో 59 బంతుల్లో 76 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచుగా నిలిచాడు. దీంతో భారత్ 7 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. అనంతరం దక్షిణాఫ్రికా 8 వికెట్ల నష్టానికి 169 పరుగులకు పరిమితమైంది. ఫలితంగా భారత్ రెండో టీ20 ప్రపంచకప్ టైటిల్‌ను సాధించింది.