టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మపై పాకిస్థాన్ దిగ్గజ క్రికెటర్ షాహిద్ అఫ్రిది ప్రశంసల జల్లు కురిపించాడు. టీ20 ప్రపంచకప్ 2024లో టీమిండియా విజేతగా నిలవడంలో కెప్టెన్‌గా.. ఆటగాడిగా రోహిత్ శర్మది కీలక పాత్రని కొనియాడాడు. పాకిస్థాన్ జట్టుకు రోహిత్ శర్మ వంటి సారథి లేకపోవడమే సమస్యగా మారిందని అభిప్రాయపడ్డాడు.
కెప్టెన్ అనేవాడు అందరికి స్పూర్తిదాయకంగా ఉండాలని, రోహిత్ అలాంటి సారథేనని ప్రశంసించాడు. సౌతాఫ్రికాతో ఉత్కంఠగా సాగిన ఫైనల్లో టీమిండియా 7 పరుగుల తేడాతో గెలుపొంది 11 ఏళ్ల ఐసీసీ టైటిల్ నిరీక్షణకు తెరదించింది. భారత్ సాధించిన ఈ విజయంపై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. శత్రు దేశమైన పాకిస్థాన్ కూడా భారత్ విజయాన్ని కొనియాడుతోంది.
ఈ టోర్నీలో బాబర్ ఆజామ్ సారథ్యంలోని పాకిస్థాన్ జట్టు సూపర్-8 కూడా చేరకుండా గ్రూప్ దశలోనే ఇంటిదారి పట్టింది. అమెరికా వేదికగా జరిగిన మ్యాచ్‌ల్లో ఆతిథ్య జట్టుతో పాటు భారత్ చేతిలో ఓటమిపాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది. బాబర్ ఆజామ్ చెత్త కెప్టెన్సీతో పాటు ఆటగాళ్ల గ్రూప్ రాజకీయాలే పాకిస్థాన్ పతనాన్ని శాసించాయని ఆ దేశ మాజీ క్రికెటర్లు మండిపడ్డారు. తాజాగా భారత విజయంపై స్పందించిన షాహిద్ అఫ్రిది.. రోహిత్ శర్మలాంటి కెప్టెన్‌ను రెడీ చేయాలని పీసీబీకి సూచించాడు.
'జట్టులో కెప్టెన్ పాత్ర చాలా కీలకం. అతని బాడీ లాంగ్వేజ్.. జట్టు నడిచే తీరును తెలియజేస్తోంది. కెప్టెన్ అనేవాడు ఓ ఉదాహరణగా ఉండాలి. రోహిత్ శర్మ అలాంటి సారథే. అతను ఆడే విధానం, బ్యాటింగ్ శైలి అద్భుతం. లోయరార్డర్ బ్యాటర్ ఆత్మవిశ్వాసంతో బ్యాటింగ్ చేస్తున్నారంటే అందుకు కారణం రోహిత్ శర్మ. అతని దూకుడైన బ్యాటింగ్ వారిని స్వేచ్చగా ఆడేలా చేసింది. జట్టులో కెప్టెన్ పాత్ర కీలకమని నేను ఎప్పుడూ నమ్మే విషయం.
పీసీబీ ఛైర్మన్ ఏం చేయాలనుకుంటున్నాడో నాకైతే తెలియదు. జట్టులో ఏం మార్పులు చేస్తారో చూసేందుకు వెయిట్ చేస్తున్నాను. నేను ఎప్పుడూ పాకిస్థాన్ జట్టుకు అండగా ఉంటాను. జట్టుకు పనికొచ్చే ఓ సానుకూలమైన నిర్ణయం తీసుకోవాలి. ఎలాంటిదైనా సూపర్ అఫిషియల్స్ తీసుకునేటట్లు ఉండకూడదు. పాకిస్థాన్ క్రికెట్ గ్రాస్ రూట్స్ నుంచే మార్పులు చేయాలి. దేశవాళీ క్రికెట్ నుంచే ప్రక్షాళన మొదలుపెట్టాలి. పాక్ దేశవాళీ క్రికెట్ మరీ నాసిరకంగా ఉంది. అక్కడ కొంత ఖర్చు పెడితే అసాధారణమైన ఆటగాళ్లు జట్టులోకి వస్తారు.'అని షాహిద్ అఫ్రిది చెప్పుకొచ్చాడు.