టీ20 ప్రపంచకప్ 2924 ఫైనల్‌లో దక్షిణాఫ్రికాను ఓడించిన భారత్ విశ్వవిజేతగా నిలిచిన సంగతి తెలిసిందే.దాంతో 17 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. భారత్ రెండోసారి పొట్టి ప్రపంచకప్‌ను అందుకోవడంతో ఆటగాళ్లతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఫైనల్‌లో విజయం అనంతరం టీమిండియా ఆటగాళ్ల సంబరాలు మిన్నంటాయి. కొంతమంది ప్లేయర్స్ భావోద్వేగానికి గురయ్యారు. కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అయితే చాలా ఎమోషనల్ అయ్యారు. కాసేపటికి రోహిత్, కోహ్లీలు జాతీయజెండాను తమ భుజాలపై కప్పుకుని.. టీ20 ప్రపంచకప్ ట్రోఫీతో ఫొటోలు దిగారు.రోహిత్ శర్మతో ఐకానిక్ ఫొటో దిగడానికి గల కారణాన్ని విరాట్ కోహ్లీ తాజాగా తెలిపాడు. ప్రపంచకప్‌తో ఇద్దరం కలిసి ఫొటో దిగుదామని రోహిత్‌ను తానే కోరినట్లు విరాట్ చెప్పాడు. ‘టీ20 ప్రపంచకప్ గెలవడం నాకే కాదు.. రోహిత్ శర్మకు కూడా చాలా ప్రత్యేకం. రోహిత్ ఫ్యామిలీ మైదానంలోనే ఉంది. సమైరాను భుజాలపై ఎత్తుకుని సంతోషపడ్డాడు. ఈ విజయం వెనక రోహిత్ కృషి ఎంతో ఉంది. కాసేపు ట్రోఫీని పట్టుకోమని రోహిత్‌కి చెప్పా. మా ఇద్దరి ప్రయాణం చాలా సుదీర్ఘమైనది. అందుకే ఇద్దరం కలిసి ఫొటో దిగాం’ అని విరాట్ కోహ్లీ స్టార్ స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ చెప్పాడు.