టీ20 ప్రపంచకప్ 2024తో టీమిండియా హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ ప్రయాణం ముగిసింది. వాస్తవానికి ద్రవిడ్ పదవీ కాలం వన్డే ప్రపంచకప్ 2023 తోనే పూర్తయింది. వన్డే ప్రపంచకప్ టైటిల్ గెలిచి సంతోషంగా వీడ్కోలు పలుకుదామని ద్రవిడ్ భావించాడు. కానీ, అందుకు భిన్నంగా జరిగింది. ఆ టోర్నీలో అప్పటివరకు వరుస విజయాలు సాధించిన టీమిండియా.. ఫైనల్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది. దీంతో టీమిండియాతో పాటు భారత క్రికెట్ ఫ్యాన్స్ కూడా నిరాశలో కూరుకుపోయారు. ఆ ఓటమి పెంచిన కసితో టీ20 ప్రపంచకప్ 2024లో మెరుగ్గా రాణించిన భారత్.. 11 ఏళ్ల తర్వాత ఐసీసీ ట్రోఫీని ముద్దాడింది. ఓడిపోయే దశ నుంచి బలంగా పుంజుకుని దక్షిణాఫ్రికాపై విజయం సాధించింది.
ఫైనల్ మ్యాచ్ అనంతరం టీమిండియా ప్లేయర్లు, కోచింగ్ స్టాఫ్ సంబరాలు చేసుకున్నారు. ప్రశాంతతకు మారుపేరుగా ఉండే రాహుల్ ద్రవిడ్ సైతం ఎన్నడూ లేనంతగా భావోద్వేగానికి గురయ్యాడు. చిన్నపిల్లాడిలా అరుస్తూ సెలబ్రేట్ చేసుకున్నాడు. ద్రవిడ్ అభిమానులను అది ఒకింత ఆశ్చర్యానికి గురిచేసింది. వన్డే ప్రపంచకప్ 2023 ఫైనల్ ఓటమి తాలుకూ ప్రభావం ద్రవిడ్‌లో కన్పించింది. కాగా టీ20 ప్రపంచకప్ 2024తో హెడ్ కోచ్ బాధ్యతల నుంచి తప్పుకున్న ద్రవిడ్‌ను ఆటగాళ్లు ఘనంగా సత్కరించారు. మైదానంలో అతడికి ట్రోఫీని అందజేశారు. ద్రవిడ్‌ను తమ భుజాలపైకి ఎత్తుకొని మైదానంలో తిరిగారు.
విరాట్ కోహ్లీ ప్రపంచకప్ ట్రోఫీ తెచ్చి అందించగానే ద్రవిడ్ ఉప్పొంగిపోయారు. ఎప్పుడూ గంభీరంగా ఉండి భావోద్వేగాలను అదుపులో ఉంచుకునే మిస్టర్ డిపెండబుల్.. ఈసారి మాత్రం తనను తాను కంట్రోల్ చేసుకోలేకపోయాడు. కోహ్లీ టైటిల్ అందించాక ద్రవిడ్ సంతోషంతో గట్టిగా అరిచారు. ఐసీసీ టైటిల్ కోసం తీవ్రంగా ప్రయత్నించినా.. ప్లేయర్‌గా మాత్రం ద్రవిడ్ తన కలను నెరవేర్చుకోలేకపోయాడు. కానీ, హెడ్ కోచ్ అయ్యాక మూడో ప్రయత్నంలో టైటిల్ దక్కింది. దీంతో అతడు సంతోషంతో ఉబ్బితబ్బిబ్బయ్యాడు.
వన్డే ప్రపంచకప్ 2023 ఫైనల్‍లో ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఓడిపోయాక ద్రవిడ్ చాలా ఫీల్ అయ్యారు. కోచ్‌గా అతడి కాలం ఆ టోర్నీతోనే ముగియగా.. పొడిగించుకునేందుకు ఇష్టపడలేదు. కానీ రోహిత్ శర్మ ఫోన్ చేసి ఒప్పించడంతో హెడ్ కోచ్‌గా టీ20 ప్రపంచకప్ వరకు కొనసాగేందుకు అంగీకరించారు. ఈ విషయాన్ని కోచ్‌గా డ్రెస్సింగ్ రూమ్‌లో తన చివరి స్పీచ్‌లో చెప్పుకొచ్చాడు. ఈ వీడియోను బీసీసీఐ పంచుకుంది.
‘గతేడాది నవంబర్‌లో ఫోన్ కాల్ చేసి హెడ్ కోచ్‌గా కొనసాగాలని నన్ను అడిగినందుకు చాలా థ్యాంక్స్ రోహిత్. నాకు మాటలు రావడం లేదు. ఈ అద్భుతమైన జ్ఞాపకంలో నన్ను భాగం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు. మీ అందరితో కలిసి పని చేయడాన్ని నేను చాలా గౌరవంగా, సంతోషంగా భావిస్తున్నా. కెరీర్‌లో మీరు చేసే పరుగులు, తీసే వికెట్ల గురించి కెరీర్లో ఎప్పుడూ గుర్తుంచుకోరు. కానీ, ఇలాంటి సందర్భాలు మాత్రం చిరకాలం గుర్తుండిపోతాయి. మీరు సాధించిన దానిపట్ల దేశం మొత్తం గర్విస్తోంది’ అని ద్రవిడ్ అన్నారు. ఇక టీ20 ఛాంపియన్‌గా నిలిచిన భారత్ ప్రస్తుతం బార్బడోస్‌లోనే ఉండిపోయింది. తుపాను కారణంగా వాతావరణం అనుకూలించకపోవడంతో ఆటగాళ్లు వెస్టిండీస్‌లోనే చిక్కుకుపోయారు. బుధవారం టీమిండియా ఆటగాళ్లు భారత గడ్డపై అడుగుపెట్టే అవకాశం ఉంది.