17 ఏళ్ల టీ20 ప్రపంచకప్ ట్రోఫీ నిరీక్షణకు తెరదించుతూ భారత జట్టును విజేతగా నిలిపిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు.. తన నివాసంలో గ్రాండ్ వెల్‌కమ్ లభించింది. గురువారం రాత్రి విజయోత్సవ ర్యాలీ, సన్మాన కార్యక్రమాలు ముగించిన ఇంటికొచ్చిన రోహిత్ శర్మను అతడి చిన్ననాటి స్నేహితులు షాక్‌కు గురిచేశారు. తమదైన శైలిలో ఆహ్వానం పలికారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.కర్మ శర్మ అని రాసి ఉన్న వైట్ కలర్ టీ షర్ట్స్ ధరించిన రోహిత్ ఫ్యాన్స్.. సెల్యూట్ చేసి టీమిండియా కెప్టెన్‌కు వెల్‌కమ్ చెప్పారు. ప్రపంచకప్ ట్రోఫీని అందుకునే సమయంలో రోహిత్ ఇచ్చిన ఫోజ్‌లోనే అతడి వద్దకు వెళ్లారు. ఇది చూసిన హిట్‌మ్యాన్ ఆశ్చర్యానికి గురయ్యాడు. అనంతరం రోహిత్‌ను అతడి చిన్ననాటి స్నేహితులు భుజాలపై ఎత్తుకున్నారు. టపాసులు కాల్చుతూ సంబురాలు చేసుకున్నారు. మెడలో పూలదండ వేసి చిరు సత్కారం చేశారు. ఈ వీడియోలో రోహిత్ చిన్ననాటి స్నేహితులో పాటు తెలుగు క్రికెటర్ తిలక్ వర్మ కూడా ఉండటం గమనార్హం. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
అనంతరం ఇంట్లోకి అడుగుపెట్టిన రోహిత్ శర్మకు కుటుంబ సభ్యులు కూడా సర్‌ప్రైజ్ ఇచ్చారు. గుమ్మ వద్ద పూలు చల్లి.. వాటిపై రావాలన్నట్లుగా ఆహ్వానించారు. డోర్ వద్దే నిల్చుని రోహిత్ శర్మ ఫొటోలకు ఫోజులిచ్చాడు. కాగా అంతకుముందే విజయోత్సవ ర్యాలీలోనూ రోహిత్ శర్మ పేరు మార్మోగిపోయింది. ముంబైకి రాజా రోహిత్ శర్మ అనే నినాదాలను ఫ్యాన్స్ చేశారు. వాంఖడే స్టేడియంలో సన్మాన కార్యక్రమంలోనూ ఇదే జరిగింది. స్టేడియం మొత్తం రోహిత్ నామస్మరణతో ఊగిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియోలు తెగ వైరల్ మారాయి.
టీ20 ప్రపంచకప్ టైటిల్‌తో 11 ఏళ్లుగా ఐసీసీ ట్రోఫీ కోసం కొనసాగుతున్న నిరీక్షణకు తెరబడింది. దీంతో దేశవ్యాప్తంగా సంబురాలు అంబరాన్నంటాయి. ఇక టీమిండియాకు టీ20 ప్రపంచకప్ టైటిల్ అందించిన అనంతరం రోహిత్ శర్మ అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు పలికాడు. విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజాలు కూడా టీ20లకు గుడ్‌బై చెప్పేశారు. రోహిత్ శర్మ ఇకపై వన్డే, టెస్టు ఫార్మాట్‌లోనే టీమిండియాకు ఆడనున్నాడు. వచ్చే ఏడాది జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీ, ప్రపంచ టెస్టు ఛాంపియన్స్ షిప్ ఫైనల్స్‌లో విజయం సాధించేందుకు ఇప్పటి నుంచి భారత్ వ్యూహాలు రచిస్తోంది. రోహిత్ సారథ్యంలో ఆ రెండు ట్రోఫీలను సైతం చేజిక్కించుకోవాలని భారత్ భావిస్తోంది. ఛాంపియన్స్ ట్రోఫీ పాకిస్థాన్ వేదికగా జరగనుండగా.. ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ఇంగ్లాండ్‌లో జరుగుతుంది.