టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌లో సూర్యకుమార్ యాదవ్ అందుకున్న స్టన్నింగ్ క్యాచ్‌ను వివాదాస్పంగా మారుస్తున్న ఆస్ట్రేలియా మీడియాపై భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ తీవ్రంగా మండిపడ్డాడు. సూర్య క్యాచ్‌ను వేలు ఎత్తి చూపే ముందు ఆస్ట్రేలియా చేసిన అత్యంత కఠోర మోసాలని తెలుసుకోవాలని ధ్వజమెత్తాడు. బౌండరీ లైన్‌ను తాకకుండా సూర్య క్యాచ్ అందుకున్నట్లు స్ఫష్టంగా కనిపిస్తున్నా.. భారత్ విజయంపై ఆస్ట్రేలియా మీడియా విషం చిమ్మడాన్ని గవాస్కర్ ఖండించాడు.
ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్‌లో దక్షిణాఫ్రికాపై భారత్ ఏడు పరుగుల తేడాతో గెలిచిన సంగతి తెలిసిందే.మొదట భారత్ ఏడు వికెట్లకు 176 పరుగులు చేసింది. అనంతరం ఛేదనలో దక్షిణాఫ్రికా ఎనిమిది వికెట్లకు 169 పరుగులు చేసింది. అయితే సూర్య అందుకున్న అద్భుతమైన క్యాచ్ మ్యాచ్ టర్నింగ్ పాయింట్‌గా మారింది. సౌతాఫ్రికా విజయానికి 6 బంతుల్లో 15 పరుగులు అవసరమవ్వగా.. హార్దిక్ వేసిన తొలి బంతిని డేవిడ్ మిల్లర్ లాంగాఫ్ దిశగా భారీ షాట్ ఆడాడు.
దాదాపు సిక్సర్‌గా దూసుకెళ్లిన ఈ బంతిని సూర్య బౌండరీ లైన్‌పై చాకచక్యంగా అందుకున్నాడు. ముందుగా సిక్సర్‌ను అడ్డుకొన్న సూర్య, తర్వాత సమన్వయం కోల్పోవడంతో బంతి గాల్లోకి విసిరేసాడు. బౌండరీ రోప్ దాటి, మళ్లీ మైదానంలోకి వచ్చి బంతిని అందుకున్నాడు. ఈ క్యాచ్ మ్యాచ్‌ను మలుపు తిప్పింది. సూర్య క్లియర్ క్యాచ్ అందుకున్నాడని తాజాగా మరో కొత్త వీడియో కూడా వచ్చింది. కానీ ఆస్ట్రేలియా మీడియా మాత్రం దీనిపై రచ్చ చేస్తోంది. దీంతో గవాస్కర్ సీరియస్ అయ్యాడు.
''ఫైనల్‌లో డేవిడ్ మిల్లర్‌ను సూర్యకుమార్ స్టన్నింగ్ క్యాచ్‌తో ఔట్ చేశాడు. అయితే ఈ ఔట్ నిష్పక్షపాతంగానే నిర్ణయించారా అని ఆస్ట్రేలియా పేపర్లలో రాస్తున్నారు. రిప్లైలో సూర్య క్యాచ్ స్పష్టంగా కనిపిస్తోంది. అతను అద్భుతంగా బ్యాలెన్స్ చేస్తూ క్యాచ్‌ను అందుకున్నాడు. బంతి అందుకుని, బౌండరీ లైన్ దాటేలోపే గాల్లో ఉంటూ లోపలికి విసిరాడు. ఆ తర్వాత లోపలికి వచ్చి చక్కగా క్యాచ్ పట్టాడు. దీని గురించి ఎవరూ ప్రశ్నించట్లేదు. ఆ ఆర్టికల్ రాసిన రైటర్ తప్ప. సూర్యకుమార్ వైపు వేలు ఎత్తి చూపే ముందు ఆస్ట్రేలియా చేసిన పది కఠోర మోసాల గురించి అతను వీడియోలు చూడాల్సింది'' అని గవాస్కర్ పేర్కొన్నాడు.