విశ్వవేదికపై భారత్‌ను విజేతగా నిలిపిన రోహిత్ సేనతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సరదాగా ముచ్చటించారు. జూన్ 29న దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్‌లో విజయం సాధించి 13 ఏళ్ల ప్రపంచకప్ నిరీక్షణకు భారత జట్టు తెరదించిన విషయం తెలిసిందే. అయితే టీమిండియా టీ20 వరల్డ్ కప్‌తో భారత గడ్డపై గురువారం అడుగుపెట్టింది.
బార్బోడస్ నుంచి ప్రత్యేకం విమానంలో ఆటగాళ్లు మొదట ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు. అనంతరం హోటల్‌కు వెళ్లిన టీమిండియా తర్వాత ప్రధాని మోదీ నివాసానికి వెళ్లారు. అయితే టీమిండియాతో మోదీ సరదాగా మాట్లాడారు. జట్టును గొప్పగా నడిపించిన కెప్టెన్ రోహిత్ శర్మను కొన్ని ప్రశ్నలు వేశారు. బార్బడోస్ పిచ్ మట్టి రుచి ఎలా ఉందో అడిగి తెలుసుకున్నారు.
ఫైనల్ విజయానంతం పిచ్‌పై ఉన్న మట్టిని రోహిత్ టేస్ట్ చేశాడు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట్లో వైరల్ మారాయి. అలాగే ట్రోఫీని అందుకునే సమయంలో భిన్నంగా రోహిత్ చేసిన వాక్ స్టైల్ గురించి కూడా మోదీ ప్రశ్నించారు. అసలు ఆ ఐడియా ఎవరు ఇచ్చారు? చాహల్ ఇచ్చాడా? అని మోదీ అడిగారు. దీనికి రోహిత్ శర్మ ఇలా సమాధానమిచ్చాడు.
''సర్.. అది చాహల్, కుల్‌దీప్ ఇద్దరి ఆలోచన. ఆ రోజు కోసం మేం ఎన్నో రోజులు ఎదురుచూశాం. దీంతో ఇది స్పెషల్‌గా ఉండాలని, ట్రోఫీని అందుకోవడానికి వచ్చేటప్పుడు సాధారణంగా నడుస్తు రావొద్దని, భిన్నంగా చేయాలని నా సహచర ఆటగాళ్లు చెప్పారు. గత ఏడాది జరిగిన వన్డే వరల్డ్ కప్‌ను అందుకోవడానికి చాలా దగ్గరగా వచ్చాం. కానీ ఫైనల్‌లో ఓటమిపాలయ్యాం''
''ఈ సారి జట్టు పడిన కష్టానికి ప్రతిఫలం దక్కింది. బార్బడోస్ పిచ్‌కు ప్రాముఖ్యత ఉంది. దానిపైనే మేం ఫైనల్ ఆడాం. కాబట్టి నేను ఏమైనా చేయాలనుకున్నాను. అలా అనుకోకుండా మట్టిని టేస్ట్ చేశాను'' అని రోహిత్ తెలిపాడు. కాగా, స్పిన్నర్ యుజువేంద్ర చాహల్‌తో మోదీ సరదాగా మాట్లాడారు. చాహల్‌ను ఆటపట్టిస్తూ జోకులు పేల్చారు. టీ20 వరల్డ్ కప్ భారత జట్టులో ఉన్నప్పటికీ చాహల్ ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. తుదిజట్టులో చోటు దక్కలేదు. అన్ని మ్యాచ్‌ల్లో బెంచ్‌కే పరిమితమయ్యాడు.