అంతర్జాతీయ క్రికెట్‌కు టీ20 క్రికెట్ వీడ్కోలు పలికిన తర్వాత తొలి సిరీస్ ఆడేందుకు భారత క్రికెట్ జట్టు సిద్ధమైంది. టీ20 ప్రపంచకప్ 2026 కోసం ఇప్పటినుంచే ప్రణాళికలు రచిస్తున్న టీమిండియా.. ఆ మేరకు యువ ఆటగాళ్లను జింబాబ్వేతో టీ20 సిరీస్ కోసం ఎంపిక చేసింది. జింబాబ్వే వేదికగా నేటి నుంచి ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. టీమిండియాలో సుస్థిర స్థానం ఆశిస్తున్న కుర్రాళ్లకు తామేంటో నిరూపించుకునేందుకు ఇదే మంచి అవకాశం. శుభ్‌మన్ గిల్ నేతృత్వంలోని ద్వితీయ శ్రేణి భారత జట్టు.. ఈ సిరీస్‌లో తమదైన ముద్ర వేయాలని ఉవ్విళ్లూరుతోంది.టీ20 ప్రపంచకప్ 2024 కోసం ఎంపిక చేసిన భారత జట్టులో చోటు దక్కించుకోలేకపోయిన శుభ్‌మన్ గిల్‌ను బీసీసీఐ అనూహ్యంగా కెప్టెన్‌గా ఎంపిక చేసింది. దీంతో అతడు ఈ సిరీస్‌లో రాణిస్తే.. భవిష్యత్‌లోనూ టీ20 క్రికెట్‌లో సుస్థిర స్థానం పొందే అవకాశం ఉంది. ఇక గిల్‌తో పాటు రుతురాజ్ గైక్వాడ్, అభిషేక్ శర్మ, సాయి సుదర్శన్, జితేశ్ శర్మ, రింకూ సింగ్ లాంటి కుర్రాళ్ల ప్రదర్శన ఈ సిరీస్‌లో ఎలా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది.
జింబాబ్వేతో భారత్ ఐదు మ్యాచ్‌లు ఆడనుంది కాబట్టి.. జట్టులోని 15 మంది సభ్యులూ కనీసం ఒక్కో మ్యాచ్ అయినా ఆడే అవకాశం రావొచ్చు. యువ ఆటగాళ్లను పరీక్షించడానికే ఈ సిరీస్‌ను వినియోగించుకోవాలని భారత యాజమాన్యం భావిస్తోంది. ఇటీవల టీ20 ప్రపంచకప్ గెలిచిన జట్టులోని ఒక్క ఆటగాడు కూడా తొలి రెండు మ్యాచ్‌లకు అందుబాటులో లేకపోవడం గమనార్హం.
శుభ్‌మన్‌కు తోడుగా రుతురాజ్ గైక్వాడ్ ఇన్నింగ్స్‌ను ఆరంభించే అవకాశముంది. ఐపీఎల్‌లో అదరగొట్టిన అభిషేక్ శర్మ, రియాన్ పరాగ్‌లు కూడా అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు. ఫినిషర్ పోస్టుకు ఖర్చీఫ్ వేసుకోవాలని రింకూ సింగ్ ఉవ్విళ్లూరుతున్నాడు. వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్, ఖలీల్ అహ్మద్, ముకేశ్ కుమార్‌లు భారత బౌలింగ్ దళంలో ఉన్నారు.
సికిందర్ రజా నాయకత్వంలోని జింబాబ్వే జట్టులో కూడా ప్రతిభావంతులకు కొదవలేదు. దీంతో కుర్రాళ్లతో నిండిన భారత జట్టుకు జింబాబ్వే నుంచి గట్టి పోటీ ఉండొచ్చు. భారత్-జింబాబ్వే జట్ల మధ్య ఇప్పటివరకు 8 టీ20 మ్యాచ్‌లు జరిగాయి. అందులో ఆరింట్లో భారత్, రెండింట్లో జింబాబ్వే గెలిచింది. సాయంత్రం 4.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.
తుది జట్లు (అంచనా):
భారత్: శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, అభిషేక్ శర్మ, రియాన్ పరాగ్, జితేశ్ శర్మ, రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్, ముకేశ్ కుమార్, ఖలీల్ అహ్మద్
జింబాబ్వే జట్టు: ఇనోసెంట్ కైయా, జొనాథన్ క్యాంప్‌బెల్, సికిందర్ రజా (కెప్టెన్), మరుమాని, మసకద్జా, షుంబా, మద్వీర, జాంగ్వి, చటార, ముజరబాని, ఎంగరవ.