జింబాబ్వే పర్యటనను టీమిండియా ఓటమితో ప్రారంభించింది. వారం రోజుల క్రితమే టీ20 ఫార్మాట్‌లో ఛాంపియన్‌గా నిలిచిన టీమిండియా.. కనీసం మెగా టోర్నీకి అర్హత కూడా సాధించిన పసికూన జింబాబ్వే చేతిలో ఖంగుతిన్నది. ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా హరారే వేదికగా శనివారం జరిగిన తొలి మ్యాచ్‌లో 13 పరుగుల తేడాతో టీమిండియా ఓటమిపాలైంది. 116 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని టీమిండియా చేధించలేకపోయింది. భారత్ పరాజయానికి ప్రధాన కారణం పేలవ బ్యాటింగ్. అరంగేట్ర ఆటగాళ్లు, ఐపీఎల్ సంచలనాలు దారుణంగా విఫలమవ్వగా.. బాధయతాయుతంగా ఆడాల్సిన ప్లేయర్లు తీవ్రంగా నిరాశపరిచారు. దాంతో టీమిండియాకు ఘోర పరాజయం తప్పలేదు.
మడతెట్టిన మదండే..
అయితే టీమిండియా ఓటమిని జింబాబ్వే వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ క్లైవ్ మదండే శాసించాడు. ఆఖరి వికెట్‌కు అజేయంగా 25 పరుగులు జోడించి టీమిండియా ఓటమికి బాటలు వేసాడు. అతని అసాధారణ పోరాటమే మ్యాచ్‌ను మలుపు తిప్పింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 115 పరుగులు చేసింది. క్లైవ్ మదండే(25 బంతుల్లో 4 ఫోర్లతో 29 నాటౌట్) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
రవి బిష్ణోయ్(4/13), వాషింగ్టన్ సుందర్(2/11) ధాటికి ఓ దశలో జింబాబ్వే 100 పరుగులైనా చేస్తుందా? అనిపించింది. ఈ ఇద్దరి ధాటికి 15.3 ఓవర్లలో జింబాబ్వే 90 పరుగులు చేసి 9 వికెట్లు కోల్పోయింది. దాంతో జింబాబ్వే ఆలౌటవ్వడం ఖాయమని, మ్యాచ్ ఏకపక్షం అవుతుందని అంతా అనుకున్నారు. కానీ అప్పటికే భారత స్పిన్నర్ల కోటా పూర్తవ్వడం.. పేసర్లు ముఖేష్ కుమార్, ఆవేశ్ ఖాన్‌లు వికెట్ తీయలేకపోవడం జింబాబ్వేకు కలిసొచ్చింది.
9 మంది క్యాచ్ ఔట్..
టెండయ్ చతరా(0)తో కలిసి క్లైవ్ మదండే 25 పరుగులు జోడించి జట్టు స్కోర్ 110 పరుగుల మార్క్ ధాటించాడు. అతని బ్యాటింగ్‌తో మూమెంటమ్ జింబాబ్వే వైపు మళ్లింది. పోరాడాలనే కసిని రగిల్చింది. పిచ్‌కు తగ్గట్లు సరైన ఫీల్డ్ సెటప్‌తో బౌలింగ్ చేసిన జింబాబ్వే.. అనుభవం లేని భారత బ్యాటర్లను బోల్తా కొట్టించింది. భారత బ్యాటర్లలో 9 మంది క్యాచ్ ఔట్‌గానే వెనుదిరగడం గమనార్హం. రవి బిష్ణోయ్, ఆవేశ్ ఖాన్‌లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి జింబాబ్వేను 100 పరుగుల లోపు ఆలౌట్ చేసుంటే భారత్ సునాయసంగా గెలిచేది.