ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చరిత్ర సృష్టించిన రవి బిష్ణోయ్.. 12 ఏళ్ల తర్వాత

sports |  Suryaa Desk  | Published : Sat, Jul 06, 2024, 11:15 PM

టీమిండియా యువ స్పిన్నర్ రవి బిష్ణోయ్ చరిత్ర సృష్టించాడు. 12 ఏళ్ల తర్వాత అంతర్జాతీయ టీ20ల్లో రెండు ఓవర్లు మెయిడిన్ చేసిన భారత స్పిన్నర్‌గా చరిత్రకెక్కాడు. జింబాబ్వేతో ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా శనివారం జరిగిన తొలి మ్యాచ్‌లో రవి బిష్ణోయ్ ఈ ఫీట్ సాధించాడు. ఈ మ్యాచ్‌లో రవి బిష్ణోయ్ కెరీర్ బెస్ట్ పెర్ఫామెన్స్ చేశాడు. నాలుగు ఓవర్లలో 13 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీసాడు. ఇందులో రెండు ఓవర్లను మెయిడిన్ చేశాడు. దాంతో ఈ ఫీట్ సాధించిన రెండో భారత స్పిన్నర్‌గా అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. రవి బిష్ణోయ్ కంటే ముందు హర్భజన్ సింగ్ ఈ ఫీట్ సాధించాడు.


టీ20 ప్రపంచకప్ 2012లో భాగంగా ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో హర్భజన్ సింగ్ రెండు ఓవర్లను మెయిడిన్ చేసి ఈ ఘనతను అందుకున్న తొలి భారత బౌలర్‌గా గుర్తింపు పొందాడు. ఆ తర్వాత మరే భారత స్పిన్నర్ అంతర్జాతీయ టీ20ల్లో రెండు ఓవర్లు మెయిడిన్ చేయలేదు. 12 ఏళ్ల తర్వాత రవి బిష్ణోయ్ ఈ ఘనతను అందుకున్నాడు.


ఓవరాల్‌గా భారత్ తరఫున ఈ ఫీట్ సాధించిన నాలుగో బౌలర్‌గా రవి బిష్ణోయ్ నిలిచాడు. హర్భజన్ సింగ్ తర్వాత పేసర్లు అయిన భువనేశ్వర్ కుమార్, జస్‌ప్రీత్ బుమ్రా ఈ ఫీట్ సాధించారు. భువనేశ్వర్ కుమార్ ఒక్కడే రెండు సార్లు ఈ ఘనతను అందుకున్నాడు. రవి బిష్ణోయ్ కెరీర్ బెస్ట్ పెర్ఫామెన్స్ చేసినా ఈ మ్యాచ్‌లో టీమిండియాకు ఓటమి తప్పలేదు. పేలవ బ్యాటింగ్ కారణంగా 13 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.


ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 115 పరుగులే చేసింది. క్లైవ్ మదాండే(25 బంతుల్లో 4 ఫోర్లతో 29 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడగా.. బ్రియాన్ బెన్నెట్(22), వెస్లీ మధెవెరే(21), డియోన్ మేయర్స్(23) డబుల్ డిజిట్ స్కోర్లు చేశారు. భారత బౌలర్లలో రవి బిష్ణోయ్(4/13), వాషింగ్టన్ సుందర్(2/11) సత్తా చాటారు.


అనంతరం స్వల్ప లక్ష్యచేధనకు దిగిన టీమిండియా అనూహ్యంగా 19.5 ఓవర్లలో 102 పరుగులకు ఆలౌటైంది. శుభ్‌మన్ గిల్(29 బంతుల్లో 5 ఫోర్లతో 31), వాషింగ్టన్ సుందర్(34 బంతుల్లో ఫోర్, సిక్సర్‌తో 27 ) మినహా అంతా విఫలమయ్యారు. జింబాబ్వే బౌలర్లలో సికిందర్ రాజా(3/25), టెండాయ్ చతరా(3/16) మూడేసి వికెట్లతో భారత్ పతనాన్ని శాసించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com