టీ20 ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన వారం తర్వాత జరిగిన తొలి మ్యాచులో భారత్ పరాజయం పాలైంది. జింబాబ్వేతో జరిగిన మ్యాచులో తొలి మ్యాచులో 13 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లాంటి సీనియర్ల రిటైర్మెంట్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, జస్‌ప్రీత్ బుమ్రా లాంటి సీనియర్లు లేకుండానే బరిలోకి దిగిన యువ భారత్ అంచనాలను అందుకోలేకపోయింది. తొలుత జింబాబ్వేన 115/9కే పరిమితం చేసినా.. బ్యాటింగ్‌లో మాత్రం దారుణంగా విఫలమైంది. 102 పరుగులకే కుప్పకూలింది. దీంతో శుభ్‌మన్ గిల్ సారథ్యంలో భారత ఆడిన తొలి టీ20 మ్యాచులో ఓడిపోయింది.అయితే మ్యాచ్ అనంతరం మాట్లాడిన కెప్టెన్ శుభ్‌మన్ గిల్.. ఓటమిపై స్పందించాడు. "ఈ ఓటమి తీవ్రంగా నిరాశపర్చింది. మేం టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాం. పిచ్ పరిస్థితిని బట్టి చూస్తే ఇది సరైన నిర్ణయమే. అందుకు తగ్గట్లుగానే బౌలింగ్ చేశా. కానీ బ్యాటింగ్‌లో మాత్రం తేలిపోయాం. ప్రతి ఒక్క బ్యాటర్ కూడా స్వేచ్ఛగా ఆడాలన్నదే మా ప్లాన్. కానీ దురదృష్టవశాత్తు ప్రణాళిక ప్రకారం ఆడలేకపోయాం. వరుసగా వికెట్లు కోల్పోయా. మా ఇన్నింగ్స్ సగం ముగిసేసరికే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డాం. అయినా నేను క్రీజులో ఉండటంతో గెలుస్తామనే నమ్మకం ఉంది. కానీ నేను ఔట్ అయ్యాక మ్యాచ్ స్వరూపమే మారిపోయింది. ఎక్కడ తప్పు జరిగిందో సమీక్షించుకుంటాం. ఈ సిరీస్‌లోని మిగతా మ్యాచుల్లో తప్పులు రిపీట్ కాకుండా చూసుకుంటాం" అని శుభ్‌మన్ గిల్ వ్యాఖ్యానించాడు.
కాగా జింబాబ్వే చేతిలో భారత జట్టు ఓడిపోతుందని ఎవరూ ఊహించి ఉండరు. అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, రియాన్ పరాగ్, రింకూ సింగ్, ధ్రువ్ జురెల్ లాంటి ప్లేయర్లతో టీమిండియా బలంగానే కనిపించింది. బౌలింగ్‌లోనూ రవి బిష్ణోయ్, ముకేశ్ కుమార్, ఖలీల్ అహ్మద్, ఆవేశ్ ఖాన్‌లు ఉండటంతో ప్రత్యర్థిని కట్టడి చేస్తారని అంతా భావించారు. అనుకున్నట్లుగానే బౌలింగ్‌లో టీమిండియా రాణించింది. ఆతిథ్య జింబాబ్వేను 115/9 పరుగులకే పరిమితం చేసింది.
కానీ 116 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్.. అనూహ్యంగా తడబడింది. 102 పరుగులకే కుప్పకూలి 13 పరుగుల తేడాతో ఓడిపోయింది. రాణిస్తారని ఆశలు పెట్టుకున్న ఐపీఎల్ హీరోలు అభిషేక్ శర్మ (0), రుతురాజ్ గైక్వాడ్ (7), రియాన్ పరాగ్ (2), రింకూ సింగ్(0), ధ్రువ్ జురెల్ (6)లు ఘోరంగా విఫలమయ్యారు. దీంతో భారత్‌కు ఓటమి తప్పలేదు. మరి ఆదివారం జరిగే రెండో టీ20 మ్యాచులో ఈ యంగ్ ప్లేయర్లు ఏ చేస్తారో చూడాలి..!