అరంగేట్ర మ్యాచులో అదరగొట్టాలి.. తానేంటో నిరూపించుకోవాలి.. ఆట ఏదైనా.. ఆటగాడు మాత్రం కోరుకునేది ఇదే. కానీ అన్నీ మనం అనుకున్నట్లు జరగవు కదా. ఎన్నో ఆశలు, అంచనాలతో బరిలోకి దిగినా అనూహ్యంగా తడబాటుకు గురైన ప్లేయర్లు ఎంతో మంది ఉన్నారు. ఇక క్రికెట్‌లోనూ ఇది చాలా సార్లు జరిగింది. దేశవాళీ, ఐపీఎల్‌లో పరుగుల వరద పారించి టీమిండియాలో చోటు దక్కించుకోవడం, కానీ తొలి మ్యాచులో రాణించకపోవడం జరుగుతుంటుంది. ఇందుకు తాజా ఉదాహారణగా నిలిచాడు టీమిండియా యువ బ్యాటర్ అభిషేక్ శర్మ.సీనియర్ల రిటైర్మంట్, గైర్హాజరీతో జింబాబ్వేతో సిరీస్‌కు చోటు దక్కించుకున్న ఈ ప్లేయర్.. తొలి టీ20ల్లో డకౌట్ అయ్యాడు. తొలి ఓవర్‌లో తాను ఎదుర్కొన్న తొలి మూడు బంతులను డాట్ చేసిన అభిషేక్ శర్మ.. నాలుగో బంతికి భారీ షాట్‌కు ప్రయత్నించాడు. కానీ అనుకున్నట్లుగా కనెక్ట్ చేయలేకపోయి.. క్యాచ్ ఔట్ అయ్యాడు. దీంతో అంతర్జాతీయ టీ20ల్లో అరంగేట్ర మ్యాచులో డకౌట్ అయి ఓ చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.
అభిషేక్ శర్మ కంటే ముందు మరో ముగ్గురు భారత ఆటగాళ్లు సైతం టీ20ల్లో అరంగేట్ర మ్యాచులోనే డకౌట్ అయ్యారు. తొలుత టీమిండియా దిగ్గజ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఈ జాబితాలో చోటు దక్కించుకున్నాడు. 2016లో జింబాబ్వేతో మ్యాచులో కేఎల్ రాహుల్, 2021లో శ్రీలంకతో మ్యాచులో పృథ్విషాలు సైతం ఇలాగే డకౌట్ అయ్యారు. అయితే రాహుల్, పృథ్విషాలు తాము ఎదుర్కొన్న తొలి బంతికే డకౌట్ కావడం గమనార్హం.
కాగా ఐపీఎల్ 2024లో సన్ రైజర్స్ హైదరాబాద్ తరఫున అభిషేక్ శర్మ అదరగొట్టాడు. ట్రావిస్ హెడ్‌తో కలిసి ఇన్నింగ్స్ ఆరంభిస్తూ పరుగుల వరద పారించాడు. ఈ క్రమంలోనే రికార్డులు బద్దలు కొట్టాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఫైనల్ చేరడంలో కీలకపాత్ర పోషించాడు. ఐపీఎల్ 2024లో 16 మ్యాచులు ఆడిన అభిషేక్ శర్మ.. 200 లకు పైగా స్ట్రైక్ రేటుతో 484రన్స్ స్కోరు చేశాడు. ఒక సీజన్‌లో అతడు నమోదు చేసిన అత్యధిక రన్స్ ఇవే కావడం గమనార్హం.
కాగా 2018 ఎడిషన్ ద్వారా అభిషేక్ ఐపీఎల్‌లో డెబ్యూ చేశాడు. ఢిల్లీ డేర్‌డెవిల్స్ (ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్) తరఫున తొలి సీజన్ ఆడాడు. కానీ ఆ సీజన్‌లో 3 మ్యాచులు మాత్రమే ఆడాడు. ఆ తర్వాత నుంచి సన్ రైజర్స్ హైదరాబాద్ తరఫున బరిలోకి దిగుతున్నాడు. అన్ని సీజన్‌లతో పోలిస్తే 2024 ఎడిషన్‌లో పరుగుల వరద పారించాడు. దీంతో సెలక్టర్ల దృష్టిని ఆకర్షించి జట్టులో చోటు సంపాదించాడు. అయితే తొలి మ్యాచులో విఫలమైనప్పటికీ అతడికి రెండో టీ20 మ్యాచు కోసం తుది జట్టులో చోటు దక్కే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అందివచ్చిన అవకాశాన్ని అతడు సద్వినియోగం చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. కాగా రెండో టీ20 మ్యాచ్ ఈరోజు సాయంత్రం 4.30 గంటలకు జరగనుంది.