శుభ్‌మన్ గిల్ సారథ్యంలోని యువ భారత్ జట్టు జింబాబ్వే పర్యటనలో తొలి విజయాన్ని నమోదు చేసింది. ఆదివారం జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టి 100 పరుగుల తేడాతో జింబాబ్వేని చిత్తుగా ఓడించింది. తొలుత బ్యాటింగ్‌లో 234/2 పరుగులు చేసిన టీమిండియా.. ఆ తర్వాత జింబాబ్వేను 18.4 ఓవర్లలో 134 పరుగులకు కుప్పకూల్చింది. కాగా శనివారం జరిగిన సిరీస్ ఆరంభ మ్యాచ్‌లో జింబాబ్వే 13 పరుగుల తేడాతో గెలిచింది. ఈ విజయంతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో రెండు మ్యాచ్‌లు ముగిసే సరికి భారత్, జింబాబ్వేలు 1-1తో నిలిచాయి. మూడో టీ20 మ్యాచ్ బుధవారం జరగనుంది.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. భారీ స్కోరు నమోదు చేసింది. ఐపీఎల్ 2024 హీరో అభిషేక్ శర్మ సెంచరీతో చితక్కొట్టడంతో నిర్ణీత 20 ఓవర్లలో 234/2 పరుగులు చేసింది. రుతురాజ్ గైక్వాడ్ (47 బంతుల్లో 77 రన్స్), రింకూ సింగ్ (22 బంతుల్లో 48 రన్స్) కూడా బ్యాట్ ఝుళిపించారు. ఈ మ్యాచ్‌లో తొలి పది ఓవర్‌లలో 74/1 పరుగులు మాత్రమే చేసిన భారత్.. ఆ తర్వాత యువ బ్యాటర్లు సిక్స్‌లు, ఫోర్లతో చెలరేగడంతో చివరి 10 ఓవర్లలో 160/1 రన్స్ పిండుకుంది.
అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే.. భారత బౌలర్ల ధాటికి వరుసగా వికెట్లు కోల్పోయింది. ఓ దశలో బ్రియాన్ బానెట్ 9 బంతుల్లో 26 పరుగులు చేయడంతో.. 2.5 ఓవర్లలో 40/1తో నిలిచింది. ఆ తర్వాత వరుసగా వికెట్లు కోల్పోయి.. పీకల్లోతు కష్టాల్లో పడింది. పేసర్లు ముకేశ్ కుమార్, ఆవేశ్ ఖాన్‌ల దెబ్బకు 46/4తో నిలిచింది. ఆ తర్వాత కూడా వరుసగా వికెట్లు కోల్పోయి 18.4 ఓవర్లలో 134 పరుగులకు ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో ముకేశ్ కుమార్ 3, ఆవేశ్ ఖాన్ 3, రవి బిష్ణోయ్ 2, వాషింగ్టన్ సుందర్ 1 వికెట్ తీశారు. ఈ మ్యాచ్ ఫలితంతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ 2 మ్యాచ్‌లు ముగిసే సరికి 1-1తో సమమైంది. మూడో టీ20 మ్యాచ్ జూలై 10న జరగనుంది.