టీమిండియా పేసర్, హైదరాబాద్ బిడ్డ మొహమ్మద్ సిరాజ్‌కు తెలంగాణ ప్రభుత్వం అపురూప కానుక ప్రకటించింది. టీ20 వరల్డ్ కప్ 2024 టోర్నీ విన్నింగ్ జట్టులో సభ్యుడైన సిరాజ్‌కు ఇంటి స్థలాన్ని, ప్రభుత్వ ఉద్యోగాన్ని ఇచ్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వరల్డ్ కప్‌తో స్వదేశానికి తిరిగొచ్చిన క్రికెటర్ మొహమ్మద్ సిరాజ్.. మంగళవారం (జూలై 9) సీఎం రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశాడు. ముఖ్యమంత్రికి టీమ్ ఇండియా జెర్సీని బహూకరించాడు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఈ ప్రకటన చేశారు.టీ20 ప్రపంచకప్ సాధించినందుకు మొహ్మద్ సిరాజ్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు. సిరాజ్‌కు హైదరాబాద్‌లో ఇంటి స్థలం, ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని.. హైదరాబాద్ పరిసరాల్లో స్థలం గుర్తించాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నేత అజహరుద్దీన్ సైతం సిరాజ్‌ను అభినందించారు.
యూఎస్‌ఏ-వెస్టిండీస్ వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్ 2024 టోర్నీలో ఫైనల్స్‌లో దక్షిణాఫ్రికాను ఓడించి ట్రోఫీ సాధించింది భారత జట్టు. 13 ఏళ్ల తర్వాత ప్రపంచకప్ సాధించడంతో ఈ ఘట్టాన్ని వేడుకలా నిర్వహించుకున్నారు భారత అభిమానులు. ముంబైలోని మెరైన్ డ్రైవ్‌లో బీసీసీఐ నిర్వహించిన విజయోత్సవ ర్యాలీకి అభిమానులు లక్షలాదిగా తరలివచ్చారు. విశ్వవిజేతలకు ఘనంగా స్వాగతం పలికారు.
ప్రపంచకప్ ట్రోఫీ గెలిచిన తర్వాత హైదరాబాద్ వచ్చిన మొహమ్మద్ సిరాజ్‌కు అభిమానులు శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఘనంగా స్వాగతం పలికారు. విమానాశ్రయం నుంచి ఓపెన్ టాప్ జీపులో భారీ ర్యాలీగా నగరానికి చేరుకున్నాడు సిరాజ్. టీ20 వరల్డ్ కప్ కోసం ఎంపిక చేసిన భారత జట్టులో ఉన్న సిరాజ్.. లీగ్ మ్యాచుల్లో మాత్రమే ఆడాడు. సూపర్ 8, సెమీ ఫైనల్, ఫైనల్ మ్యాచ్‌లో బెంచ్‌కే పరిమితమయ్యాడు. ఇండియా వరల్డ్ కప్ గెలిచిన తర్వాత తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు సిరాజ్. మైదానంలో సిరాజ్ కంటతడి పెట్టిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
టీ20 ప్రపంచకప్ ట్రోఫీని సాధించిన భారత జట్టుకు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు రూ. 125 కోట్ల నజరానా ప్రకటించింది. కోచ్ సహా ఒక్కో ఆటగాడికి రూ. 5 కోట్ల చొప్పున దక్కనున్నాయి. మొహమ్మద్ సిరాజ్ కూడా తన వాటాగా 5 కోట్ల రూపాయలు అందుకోనున్నాడు. అటు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే.. వరల్డ్ కప్ సాధించిన టీమిండియా జట్టులోని ముంబై ఆటగాళ్లకు రూ. 11 కోట్ల బహుమతి ప్రకటించారు.