హరారే వేదికగా టీమిండియా- జింబాబ్వే మధ్య మూడో టీ20 మ్యాచ్ బుధవారం సాయంత్రం జరగనుంది. తొలి మ్యాచ్‌లో గిల్ సేన దారుణంగా ఓడిపోయింది. వెంటనే తేరుకున్న టీమిండియా, సెకండ్ మ్యాచ్‌లో విశ్వరూపం చూపింది. ఫలితంగా 100 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో మూడో మ్యాచ్ ఇరు జట్లకు కీలకంగా మారింది. బీసీసీఐ మరో ముగ్గురు ఆటగాళ్లను జింబాబ్వేకు పంపింది. దీంతో ఇవాళ జరగనున్న మ్యాచ్‌లో ఎవరికి ఛాన్స్ దక్కుతుందనేది అసలు ప్రశ్న. యశస్వి జైశ్వాల్, సంజు శాంసన్, శివమ్ దూబెలు అందుబాటులోకి రావడంతో టీమిండియా బలోపేతం అయ్యింది. మరి టీమిండియా వేగాన్ని అడ్డుకోవడం జింబాబ్వేకు గట్టి సవాల్‌గా మారింది.
జట్టులోకి ఎవర్ని తీసుకోవాలనేది మేనేజ్మెంట్‌కు కాస్త కష్టంగా మారింది. జైశ్వాల్- అభిషేక్‌లను ఓపెనర్లుగా దింపాలని టీమిండియా భావిస్తోంది. శుభ్‌మన్ గిల్, సంజుశాంసన్‌లను మిడిలార్డర్ అయితే బాగుంటుంద ని అంచనా వేస్తోంది. చివరలో శివమ్ దూబే, రింకూసింగ్‌లను దించాలని ఆలోచన చేస్తోంది. దానివల్ల టీమిండియా బలంగా ఉంటుందని మేనేజ్‌మెంట్ ప్లాన్. రుతురాజ్ గైక్వాడ్, వాషింగ్టన్ సుందర్, స్పిన్నర్ రవిబిష్ణోయ్, ఫాస్ట్ బౌలర్లు అవేష్‌ఖాన్, ముఖేష్‌కుమార్ లేదా ఖలీల్ అహ్మద్ లపై దృష్టి పెట్టనుంది. అదనంగా ముగ్గురు ఆటగాళ్లు చేరడంతో తుదిజట్టులోకి ఎవర్ని తీసుకుంటుందో చూడాలి. రెండో మ్యాచ్‌లో ఘోరంగా ఓటమి పాలైన జింబాబ్వే.. టీమిండియాకు గట్టి పోటీ ఇవ్వాలని భావిస్తోంది. కెప్టెన్ సికందర్ రాజా పలు మార్పులు చేయనున్నట్లు అంతర్గత సమాచారం. ఆల్‌రౌండర్లు జెనెట్, జాంగ్విలపై ఆశలు పెట్టుకుంది. కాకపోతే ఫాస్ట్ బౌలర్లను మార్చే ఆలోచన చేస్తోంది ఆ జట్టు. మరి చూడాలి ఈ మ్యాచ్ లో ఎవరు విజయం సాధిస్తారో...