టీమిండియా క్రికెట్‌లో కొత్త శకం మొదలైంది. టీ20 వరల్డ్ కప్ నెగ్గి జోరుమీదున్న జట్టు మరింత గంభీరంగా ముందుకెళ్లనుంది. రాహుల్ ద్రవిడ్ స్థానంలో ఇండియా హెడ్ కోచ్‌గా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ నియమితుడయ్యాడు. ఈ నెల 27 నుంచి సొంతగడ్డపై శ్రీలంకతో జరిగే లిమిటెడ్ ఓవర్ల సిరీస్‌తో 42 ఏండ్ల గౌతీ బాధ్యతలు చేపట్టనున్నాడు. ఈ టూర్‌లో ఇండియాతో లంక మూడు టీ20లు, మూడు వన్డేల్లో తలపడనుంది. మూడున్నర ఏండ్ల పాటు ఈ పదవిలో ఉండే గంభీర్ అన్ని ఫార్మాట్ల బాధ్యతలను చూసుకుంటాడు. టీమిండియాలోకి గౌతమ్ గంభీర్‌ను బీసీసీఐ స్వాగతిస్తోందని సెక్రటరీ జై షా పేర్కొన్నారు. 'ఇండియా క్రికెట్ టీమ్ కొత్త హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్‌ని స్వాగతిస్తున్నందుకు సంతోషంగా ఉంది. ఆధునిక క్రికెట్ వేగంగా అభివృద్ధి చెందింది. ఈ మార్పును గంభీర్ చాలా దగ్గర నుంచి చూశారు. తన కెరీర్ మొత్తంలో ఆటుపోట్లను తట్టుకొని వివిధ పాత్రల్లో రాణించారు. ఇండియన్ క్రికెట్‌ను ముందుకు నడిపించడానికి గౌతమ్ సరైన వ్యక్తి అని నేను నమ్ముతున్నా' అని ట్వీట్ చేశాడు.
టీ20 వరల్డ్ కప్ విజయంతో హెడ్ కోచ్‌గా బాధ్యతలను ముగించిన ద్రవిడ్‌కు బీసీసీఐ కృతజ్క్షతలు తెలిపింది. అతని హయాంలో ఇండియా గొప్ప ఘనతలు సాధించిందని సెక్రటరీ జై షా కొనియాడారు. టీ20 వరల్డ్ కప్ నెగ్గడంతో పాటు వన్డే వరల్డ్ కప్, డబ్ల్యూటీసీ చాంపియన్‌షిప్‌లో రన్నరప్‌గా నిలిచిందన్నారు. సొంతగడ్డపై సిరీస్‌ల్లో టీమిండియా ఆధిపత్యం చెలాయించడంతో పాటు యువ ప్రతిభావంతులను గుర్తించి, వారిలో గొప్ప క్రమశిక్షణ, క్రీడాస్ఫూర్తిని పెంచడంలో ద్రవిడ్ కృషి మరవలేనిదన్నారు. బౌలింగ్, ఫీల్డింగ్, బ్యాటింగ్ కోచ్‌లుగా పనిచేసిన పరాస్ మాంబ్రే, టి. దిలీప్, విక్రమ్ రాథోడ్‌ను కూడా బోర్డు అభినందించింది.