వచ్చే ఏడాది పాకిస్థాన్ వేదికగా ఛాంపియన్స్ ట్రోఫీ జరగనున్న విషయం తెలిసిందే. ఈ టోర్నీ షెడ్యూల్‌కు సంబంధించిన ముసాయిదాను సైతం పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఇప్పటికే ఐసీసీకి అందజేసింది. అయితే రెండు దేశాల మధ్య గత కొన్నేళ్లుగా నెలకొన్న ఉద్రిక్తతల నడుమ భారత్.. పాకిస్థాన్‌లో పర్యటించేందుకు విముఖత చూపుతోంది. హైబ్రిడ్ మోడల్‌లో టోర్నీ నిర్వహించాలని బీసీసీఐ.. ఐసీసీని కోరనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ వివాదం కొనసాగుతుండగానే.. పాకిస్థాన్ మాజీ ఆల్ రౌండర్ షాహిద్ అఫ్రిదీ విరాట్ కోహ్లీని ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను పక్కనపెట్టి.. విరాట్ కోహ్లీ ఒక్కసారి పాకిస్థాన్‌లో పర్యటించాలని అఫ్రిదీ కోరాడు. భారత స్టార్ ప్లేయర్ విరాట్ ఒక్కసారి పాకిస్థాన్ గడ్డపై అడుగుపెడితే.. ఇక్కడి అభిమానుల నుంచి లభించే ప్రేమాభిమానాలకు ముగ్దుడవుతాడని చెప్పుకొచ్చాడు.
"ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత జట్టు పాకిస్థాన్‌లో పర్యటించడాన్ని నేను స్వాగతిస్తున్నా. మేం గతంలో భారత్‌లో పర్యటించినప్పుడు మాకు గొప్ప గౌరవం, ప్రేమ లభించాయి. భారత్ చివరిసారిగా 2005లో పాకిస్థాన్‌లో పర్యటించనప్పుడు కూడా ఇదే జరిగింది. భారత్-పాకిస్థాన్ దేశాల్లో ఆయా జట్ల పర్యటనలను రాజకీయాలకు దూరంగా ఉంచాలి. రెండు జట్లు తలపడటాన్ని మించింది మరొకటి లేదు" అని షాహిద్ అఫ్రిదీ అన్నాడు.
"పాకిస్థాన్‌లో కోహ్లీ పర్యటిస్తే.. అతడికి భారత్‌లో లభించిన ప్రేమను మరిచిపోతాడు. కోహ్లీకి పాకిస్థాన్‌లో భారీ క్రేజ్ ఉంది. ఇక్కడి ప్రజలు అతడ్ని ఇష్టపడతారు. వాస్తవానికి నా ఫేవరెట్ ప్లేయర్ కూడా కోహ్లీనే. అతడికి ప్రత్యేక నైపుణ్యాలు ఉన్నాయి. అతడు టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించకుండా ఉండాల్సింది" అని షాహిద్ అఫ్రిదీ పేర్కొన్నాడు.
కాగా విరాట్ కోహ్లీ 2008లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. ఇప్పటివరకు పాకిస్థాన్‌లో ఒక్కసారి కూడా పర్యటించలేదు. ఇరు దేశాల మధ్య నెలకొన్న సరిహద్దుల ఉద్రిక్తతల నేపథ్యంలో క్రికెట్ సంబంధాలు తెగిపోయాయి. 2008లో ధోనీ సారథ్యంలోని టీమిండియా చివరిసారిగా పాకిస్థాన్‌లో పర్యటించింది. అప్పటి నుంచి ఇరు దేశాలు టీ20 ప్రపంచకప్, వన్డే ప్రంపచకప్, ఛాంపియన్స్ ట్రోఫీ, ఆసియా కప్ లాంటి టోర్నీల్లో మాత్రమే తలపడుతున్నాయి.
భారత్ వేదికగా జరిగిన ఐసీసీ టోర్నీల్లో పాకిస్థాన్ బరిలోకి దిగుతోంది. టీ20 ప్రపంచకప్ 2016, వన్డే ప్రపంచకప్ 2023లో ఆడింది. కానీ భారత క్రికెట్ జట్టు మాత్రం తమ ఆటగాళ్లకు సరైన భద్రత లభించదని పాకిస్థాన్‌లో పర్యటించడం లేదు. ఇప్పుడు కూడా భారత ప్రభుత్వం అంగీకరిస్తే పాకిస్థాన్‌లో పర్యటిస్తుంది. లేదా హైబ్రిడ్ మోడల్‌లో యూఏఈ వేదికగా ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహించే అవకాశం ఉంది. దీనిపై త్వరలోనే క్లారిటీ వస్తుందంటున్నారు.