టీ20 ప్రపంచకప్ 2024 టైటిల్ సాధించిన భారత క్రికెట్ జట్టుకు బీసీసీఐ రూ.125 కోట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఇందులో ప్రధాన జట్టులోని ప్లేయర్లకు రూ.5 కోట్ల చొప్పున ఇవ్వాలని నిర్ణయించింది. వీరితో పాటు టీ20 ప్రపంచకప్ వరకు టీమిండియా హెడ్‌కోచ్‌గా ఉన్న రాహుల్ ద్రవిడ్‌కు సైతం రూ.5 కోట్లు ఇవ్వనున్నట్లు తెలిపింది. బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్, ఫీల్డింగ్ కోచ్ దిలీప్, బౌలింగ్ కౌచ్ పరాస్ మాంబ్రేలకు రూ.2.5 కోట్లు.. సహాయక సిబ్బందితోని ముగ్గురు ఫిజియో థెరపిస్ట్‌లు, ముగ్గురు త్రోడౌన్ స్పెషలిస్టులు, ఇద్దరు మసాజర్‌లు, స్ట్రెంగ్త్ అండ్ కండీషనింగ్ కోచ్‌లకు రూ.2 కోట్ల చొప్పున ఇవ్వాలని నిర్ణయించింది. చీఫ్ సెలక్టర్ అజిత అగార్క్ సహా సెలక్షన్ కమిటీ సభ్యులకు ఒక్కొక్కరు రూ.కోటి చొప్పున కేటాయించింది. రిజర్వ్ ఆటగాళ్లు రింకూ సింగ్, శుభ్‌మన్ గిల్, ఆవేశ్ ఖాన్, ఖలీల్ అహ్మద్‌లకు రూ.కోటి చొప్పున ఇచ్చింది.
బ్యాటింగ్, ఫీల్డింగ్, బౌలింగ్ కోచ్‌లకు ఇచ్చినట్లుగానే తనకు కూడా రూ.2.5 కోట్లు ఇవ్వాలని ద్రవిడ్ కోరాడు. తనకు దక్కిన రూ.5 కోట్లలో సగాన్ని తగ్గించుకున్నాడు. అయితే ద్రవిడ్ కంటే ముందే రోహిత్ శర్మ సైతం తనకు దక్కిన మొత్తాన్ని వదులుకునేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సహాయక సిబ్బందిలో తక్కువ మొత్తం అందుకున్న వారి కోసం ఆటగాడికి తన వంతుగా వచ్చే రూ.5 కోట్ల ప్రైజ్‌మనీని వదులుకునేందుకు రోహిత్ సిద్ధమైనట్లు సమాచారం. టీ20 ప్రపంచకప్ 2024లో జట్టు గెలుపు కోసం శ్రమించిన సహాయక సిబ్బందిలో అందరికీ సమానంగా డబ్బు అందాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
“జట్టు గెలుపు కోసం త్రోడౌన్ స్పెషలిస్ట్‌లు, మసాజర్స్, ఫిజియోలు ఇలా చాలా మంది కష్టపడ్డారు. తక్కువ మొత్తం అందుకున్న సహాయ సిబ్బందిలో అందరికీ సమానంగా నా ప్రైజ్‌మనీ చెందాలని అనుకుంటున్నా” అని రోహిత్ శర్మ అన్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. కాగా టీ20 ప్రపంచకప్ 2024లో భారత్ విజేతగా నిలిచింది. ఫైనల్‌లో దక్షిణాఫ్రికాను ఓడించి 17 ఏళ్ల తర్వాత టీ20 ప్రపంచకప్ సాధించింది. దీంతో భారత క్రికెట్ నియంత్రణ మండలి రూ.125 కోట్ల ప్రైజ్‌మనీని ప్రకటించింది. ముంబైలో జరిగిన విజయోత్సవ ర్యాలీ తర్వాత ముందుగా ప్రకటించినట్లుగా రూ.125 కోట్ల చెక్కును వాంఖడేలో జరిగిన సన్మాన కార్యక్రమంలో జట్టుకు అందజేసింది.