ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ప్రధాన కోచ్ రికీ పాంటింగ్‌ను ఆ బాధ్యతల నుంచి తప్పించింది. మేరకు శనివారం సోషల్ మీడియా వేదికగా అధికారిక ప్రకటన చేసింది. గత ఏడేళ్లుగా జట్టుకు కోచ్‌గా ఉన్న పాంటింగ్.. టైటిల్ మాత్రం అందించలేకపోయాడు. దీంతో అతడిని తప్పించాలని ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఇదే సమయంలో ఆ జట్టు కొత్త కోచ్ ఎంపికపై చర్చ మొదలైంది. ప్రస్తుతం టీమ్ డైరెక్టర్‌గా ఉన్న సౌరవ్ గంగూలీని.. హెడ్‌కోచ్‌గా నియమించుకోవాలని ఆ ఫ్రాంఛైజీ భావిస్తున్నట్లు సమాచారం.
కాగా కెప్టెన్‌గా ఆస్ట్రేలియాకు రెండు ప్రపంచకప్‌లు అందించిన రికీ పాంటింగ్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ 2018 సీజన్‌లో హెడ్‌కోచ్‌గా నియమించుకుంది. అప్పటి నుంచి 7 సీజన్లు అంటే 2024 ఎడిషన్ వరకూ కూడా అతడే కోచ్‌గా ఉన్నాడు. రికీ పాంటింగ్ కోచింగ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ మూడు సీజన్లలో 2019, 2020, 2021లో ప్లేఆఫ్‌లకు అర్హత సాధించింది. 2020లో ఫైనల్ చేరింది. కానీ తుది పోరులో ముంబై ఇండియన్స్ చేతిలో ఓడిపోయింది. 2021 సీజన్ తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ వరుసగా మూడు సీజన్లలో ఒక్కసారి కూడా ప్లేఆఫ్స్ చేరకుండానే నిష్క్రమించింది.
ఏడేళ్ల నుంచి పాంటింగ్ హెడ్‌కోచ్‌గా ఉన్నప్పటికీ జట్టు ఛాంపియన్‌గా నిలవకపోవడంపై ఫ్రాంఛైజీ అసంతృప్తితో ఉంది. ఈ నేపథ్యంలో కోచ్, సహాయ సిబ్బందని మార్చాలని నిర్ణయించుకున్నట్లు ఢిల్లీ క్యాపిటల్స్ వర్గాలు తెలిపాయి. ఇదే విషయాన్ని పాంటింగ్‌కు సైతం ఫ్రాంఛైజీ వివరించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా పాంటింగ్ తీరుపై కూడా డీసీ గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది.
లీగ్ ప్రారంభానికి రెండు వారాల ముందు జట్టులో చేరడం కంటే.. వేలంలో పాల్గొని, ఆటగాళ్ల ఎంపికలో మరింత చొరవ చూపించాలని డీసీ కోరుకుంటున్నట్లు సమాచారం. ప్రస్తుతం టీమ్ డైరెక్టర్‌గా ఉన్న సౌరవ్ గంగూలీని హెడ్‌కోచ్‌గా నియమించుకోవాలని ఆ జట్టు భావిస్తోంది. ఈ నెలాఖరులో డీసీ యజమానులు భేటీ అయి దీనిపై నిర్ణయం తీసుకోనున్నారు.
రిటెన్షన్ పరిస్థితి ఏంటి?
ఐపీఎల్ 2025కు ముందు మెగా వేలం జరగనుంది. దీంతో ఆటగాళ్ల రిటెన్షన్‌పై కూడా డీసీ దృష్టిసారించనుంది. ఒకవేళ ముగ్గురు భారతీయులు, ఒక విదేశీ ప్లేయర్‌ను అట్టిపెట్టుకునే అవకాశం ఉంటే.. ఎవర్ని కొనసాగించాలి అనే విషయంపై ఆ జట్టు ఆలోచిస్తోంది. ఇదే జరిగితే కెప్టెన్ రిషభ్ పంత్‌తో పాటు.. ఆల్ రౌండర్ అక్షర్ పటేల్, స్పిన్నర్ కుల్‌దీప్ యాదవ్‌లు స్వదేశీ కోటాలో జట్టులో ఉంటారు. ఇక విదేశీ ఆటగాళ్ల విషయంలో ఆస్ట్రేలియాకు చెందిన జేక్ ఫ్రెజర్ మెక్‌గుర్క్, దక్షిణాఫ్రికా యువ ప్లేయర్ ట్రిస్టన్ స్టబ్స్ పోటీలో ఉన్నారు. ఇందులో ఒకర్ని డీసీ రిటైన్ చేసుకునే అవకాశం ఉంది.