టీ20 ప్రపంచకప్ 2024 ప్రధాన జట్టులో చోటు దక్కించుకోలేకపోయిన శుభ్‌మన్ గిల్.. ఆ తర్వాత జింబాబ్వేతో జరిగిన టీ20 సిరీస్‌కు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. సీనియర్ల గైర్హాజరీతో ద్వితీయ శ్రేణి జట్టుతో భారత్.. ఈ సిరీస్ బరిలోకి దిగింది. అయితే టీమిండియా కెప్టెన్‌గా తన తొలి సిరీస్‌ను శుభ్‌మన్ గిల్ 4-1తో సొంతం చేసుకున్నాడు. సిరీస్ ఆరంభ మ్యాచులో ఓడిపోయినా ఆ తర్వాత యువ భారత్ బలంగా పుంజుకుంది. వరుసగా నాలుగు మ్యాచుల్లో విజయం సాధించింది. సిరీస్‌ను కైవసం చేసుకుంది. అయితే ఈ సిరీస్ ద్వారా టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఓ అరుదైన రికార్డును సాధించాు.
ఓ ద్వైపాక్షిక సిరీస్‌లో విదేశీ గడ్డపై నాలుగు టీ20 మ్యాచులు గెలిచిన తొలి భారత కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్ రికార్డు సృష్టించాడు. అంతేకాకుండా టీమిండియాకు టీ20 కెప్టెన్‌గా అత్యధిక విజయాలు అందించిన ఆటగాళ్ల జాబితాలో కూడా చోటు సంపాదించుకున్నాడు. భారత టీ20 జట్టుకు శుభ్‌మన్ గిల్ 14వ కెప్టెన్ కావడం గమనార్హం. అయితే తన సారథ్యంలో జట్టుకు అత్యధిక విజయాలు అందించిన ఆరో కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్ నిలిచాడు.
మొత్తంగా టీ20 క్రికెట్‌లో టీమిండియాకు అత్యధిక విజయాలు అందించిన కెప్టెన్‌గా రోహిత్ శర్మ అగ్రస్థానంలో ఉన్నాడు. అతడి సారథ్యంలో భారత్.. 50 విజయాలు సాధించింది. ఈ జాబితాలో తర్వాతి స్థానాల్లో ఎంఎస్ ధోనీ (42), విరాట్ కోహ్లీ (32), హార్దిక్ పాండ్యా(10), సూర్యకుమార్ యాదవ్ (5)లు ఉన్నారు. వీరి తర్వాత శుభ్‌మన్ గిల్ (4) నిలిచాడు. కాగా జింబాబ్వేతో ఐదో టీ20 మ్యాచులో భారత్ 42 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆదివారం జరిగిన ఈ మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. నిర్ణీత 20 ఓవర్లలో 167/6 పరుగులు చేసింది. అనంతరం జింబాబ్వే 18.3 ఓవర్లలో జింబాబ్వే 125 పరుగులకు కుప్పకూలింది. దీంతో భారత్ 4-1తో సిరీస్ సొంతం చేసుకుంది. మ్యాచ్ అనంతరం మాట్లాడి కెప్టెన్ శుభ్‌మన్ గిల్.. జట్టు ప్రదర్శనపై సంతోషం వ్యక్తం చేశాడు.
"ఇది అద్భుతమైన సిరీస్. సిరీస్ ఆరంభ మ్యాచులో ఓటమి తర్వాత జట్టు సభ్యులు.. దెబ్బతిన్న పులివలె పంజా విసిరారు. టీమిండియా ప్రదర్శన పట్ల సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇది యువటీమ్. ఈ జట్టులోని చాలా మందికి విదేశీ గడ్డపై ఆడిన అనుభవం లేదు. కొందరు ఈ సిరీస్‌తోనే అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టారు. అయినా మేం పరిస్థితులను సద్వినియోగం చేసుకుని రాణించా. త్వరలో జరగనున్న శ్రీలంకతో సిరీస్ కోసం ఎదురుచూస్తున్నా" అని శుభ్‌మన్ గిల్ వ్యాఖ్యానించాడు.