టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్.. పాకిస్థాన్‌కు చెందిన ఓ జర్నలిస్ట్‌కు అదిరిపోయే కౌంటర్ ఇచ్చాడు. టీమిండియా దిగ్గజ ప్లేయర్ మహేంద్ర సింగ్ ధోనీతో పాకిస్థాన్ వికెట్ కీపర్ మహమ్మద్ రిజ్వాన్‌ను పోల్చడంపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇదే చెత్త ప్రశ్నరా బాబూ అన్నట్లు కౌంటర్ ఇచ్చాడు. అతడికి ఎవరైనా చెప్పండ్రా అన్నట్లు ఎద్దేవా చేశాడు.
పాకిస్థాన్‌కు చెందిన ఫరిద్ ఖాన్ అనే జర్నలిస్టు సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టాడు. మహేంద్ర సింగ్ ధోనీ, పాకిస్థాన్ వికెట్ కీపర్ మహమ్మద్ రిజ్వాన్‌లలో ఎవరు అత్యుత్తమం.. నిజాయతీగా సమాధానం చెప్పండి అని క్యాప్షన్ ఇచ్చాడు. అయితే ఫరిద్ ఖాన్ చేసిన ఈ పోస్టు వివాదాస్పదంగా మారింది. అసలు ధోనీతో.. రిజ్వాన్‌కు పోలికేంటనే ప్రశ్నలు తలెత్తాయి. ఈ విషయంపై టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ స్పందించాడు. గట్టి కౌంటర్ ఇచ్చాడు.
"ఈ రోజుల్లో ఇలాంటి చెత్త ప్రశ్నలు అడగడం అనేది దారుణం. ఎంఎస్ ధోనీతో మహమ్మద్ రిజ్వాన్‌కు పోలికేంటి. అసలు ఈ ప్రశ్నేంటి. వీరిద్దరి మధ్య ఎవరు గొప్పో చెప్పడంలో ఎలాంటి డౌట్ అవసరం లేదు. రిజ్వాన్ ఆట బాగుంటుంది. నిబద్ధతతో ఆడేందుకు అతడు ఎల్లవేళలా ప్రయత్నిస్తూ ఉంటాడు. కానీ మహేంద్ర సింగ్ ధోనీతో అతడిని పోల్చడమే తప్పు. ధోనీ సత్తా ఏంటి? ఏం చేశాడో అందరికి తెలుసు. అతడు ప్రపంచ క్రికెట్‌లో దిగ్గజం. ధోనీ మాదిరిగా వికెట్ల వెనకాల అత్యంత చురుగ్గా వ్యవహరించే వ్యక్తులు కన్పించడం చాలా అరుదు. ఇద్దరి మధ్య పోలికలో మహేంద్ర సింగ్ ధోనీనే టాప్" అని హర్భజన్ సింగ్ వ్యాఖ్యానించాడు.
కాగా సోషల్ మీడియాలో పలువురు నెటిజన్లు మాత్రం భిన్నంగా స్పందిస్తున్నారు. ధోనీ, రిజ్వాన్‌లలో ఎవరు గొప్పో ఫరిద్ ఖాన్‌కు కూడా తెలుసని.. కానీ ఫేమస్ కావాలనే ఇలాంటి చెత్త పోస్టులు పెడతాడని పేర్కొంటున్నారు. అతడి మిషన్ సక్సెస్ అయిందంటున్నారు. కాగా టీ20 ప్రపంచకప్ 2007, వన్డే ప్రపంచకప్ 2011, ఛాంపియన్స్ ట్రోఫీ 2013లో భారత జట్టును విజేతగా నిలిపాడు ధోనీ. అతడి సారథ్యంలో భారత్ మెరుగైన ప్రదర్శన చేసింది. వన్డే ప్రపంచకప్ 2019 సెమీ ఫైనల్ మ్యాచ్ తర్వాత ధోనీ.. తిరిగి టీమిండియా తరఫున మళ్లీ కన్పించలేదు. నాలుగేళ్ల కిందట అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఐపీఎల్ 2023 వరకు చెన్నై సూపర్ కింగ్స్ సారథిగా ఉన్నాడు. సీఎస్కేను ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిపాడు. ఈ ఏడాది రుతురాజ్ గైక్వాడ్‌కు బాధ్యతలు అప్పగించాడు. ధోనీ వచ్చే ఏడాది ఐపీఎల్ ఆడతాడా లేడా అన్నది తేలాల్సి ఉంది.