పారిస్ వేదికగా విశ్వక్రీడా సంబురాలు మరో ఐదు రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ మేరకు భారత అథ్లెట్లలో ఉత్సాహం నింపేలా వారి కోసం రూ.8.5 కోట్లు ఇవ్వనున్నట్లు బీసీసీఐ తెలిపింది. బీసీసీఐ కార్యదర్శి జైషా.. బీసీసీఐ నిర్ణయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఇండియన్ ఒలింపిక్ సంఘానికి ఈ మొత్తాన్ని ఇవ్వనున్నట్లు ప్రకటించారు.
“పారిస్ ఒలింపిక్స్ 2024లో పాల్గొంటున్న భారత బృందానికి భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఆర్థిక సాయం చేస్తోందని చెప్పడానికి నేను సంతోషిస్తున్నా. విశ్వ క్రీడల సందర్భంగా ఇండియన్ ఒలింపిక్ సంఘానికి రూ.8.5 కోట్లు అందజేస్తున్నాం. ఈ విశ్వ క్రీడల్లో పాల్గొననున్న భారత అథ్లెట్లకు ఆల్ ది బెస్ట్. దేశ గర్వపడేలా చేయండి. జై హింద్” అని జై షా తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.
టీ20 ప్రపంచకప్ 2024లో ఛాంపియన్‌గా నిలిచిన భారత క్రికెట్ జట్టుకు సైతం ఇటీవల బీసీసీఐ ప్రైజ్‌మనీని ప్రకటించింది. రూ.125 కోట్లను అందజేసింది. ఆటగాళ్లకు రూ.5 కోట్ల చొప్పున చెల్లించింది. హెడ్‌కోచ్, సహాయ సిబ్బంది, రిజర్వ్ ప్లేయర్లకు సైతం ప్రైజ్‌మనీని అందించింది. ఇక జులై 26 నుంచి ఆగస్టు 11 వరకు పారిస్ ఒలింపిక్స్ జరగనున్నాయి. ఈసారి భారత్ నుంచి 117 మంది అథ్లెట్లు పోటీలో ఉన్నారు. వారితో పాటు 140 మంది సహాయ సిబ్బంది కూడా ఫ్రాన్స్‌కు వెళ్తున్నారు. భారత అథ్లెట్లలో 70 మంది పురుషులు, 47 మంది మహిళా అథ్లెట్లు ఉన్నారు. అథ్లెటిక్స్‌లో 29 మంది క్రీడాకారులు ఒలింపిక్స్ 2024కు ఎంపికయ్యారు.
పారిస్ ఒలింపిక్స్‌లో 180కి పైగా దేశాల నుంచి అథ్లెట్లు పాల్గొంటున్నారు. అంతేకాకుండా పోటీలను చూసేందుకు వివిధ దేశాల సెలబ్రెటీలు, ప్రముఖులు సైతం పారిస్‌కు రానున్న నేపథ్యంలో ఫ్రాన్స్ ప్రభుత్వం భద్రతను కట్టుదిట్టం చేసింది. భద్రత కోసం భారత్‌కు చెందిన బృందాలను సైతం వినియోగించుకుంటోంది. ఇప్పటికే భారత్‌కు చెందిన సిబ్బందితో పాటు కే-9 జాతికి చెందిన 10 స్నిఫర్ డాగ్‌లు పారిస్‌లో అడుగుపెట్టాయి. పది వారాల ప్రత్యేక శిక్షణ తర్వాత అవి విధుల్లో చేరాయి. ఇందులో మొత్తంగా 6 బెల్జియన్ షెపర్డ్‌లు, 3 జర్మన్ షెపర్డ్‌లు, ఒక లాబ్రడార్ రిట్రీవర్ జాతి శునకాలు ఉన్నాయి. ఒలింపిక్స్ నిర్వహించే సమయంలో ఇవి పెట్రోలింగ్ విధుల్లో ఉంటాయి.