భారత క్రికెటర్, సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ ఉన్న క్రేజ్ ఏపాటిదో అందరికీ తెలుసు అలాంటి షమీ తన పదునైన పేస్ బౌలింగ్‌తో జట్టుకు ఎన్నో విజయాల్ని అందించాడు. ముఖ్యంగా 2019, 2023 వన్డే ప్రపంచకప్‌లో ప్రత్యర్థుల్ని బెంబేలెత్తించాడు. వరుసగా 14, 24 చొప్పున వికెట్లు తీశాడు. ఇటీవల మాత్రం క్రికెట్‌కు దూరంగా ఉంటూ వస్తున్నాడు. 2023 వరల్డ్‌కప్ తర్వాత.. చీలమండ గాయంతో సర్జరీ చేయించుకున్నాడు. దీంతో చాన్నాళ్లుగా ఆటకు దూరమయ్యాడు. ఇప్పుడిప్పుడే కోలుకొని జట్టులోకి పునరాగమనం చేసేందుకు సిద్ధమవుతున్నాడు. ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టాడు. అయితే ఆటగాడిగా షమీ జీవితం బాగానే ఉన్నప్పటికీ.. వ్యక్తిగత జీవితంలో మాత్రం అతడ్ని ఎన్నో సమస్యలు వెంటాడుతున్నాయి.
2018 సంవత్సరంలో షమీ జీవితంలో పెద్ద తుపానే వచ్చిందని చెప్పొచ్చు. అతడి భార్య పెట్టిన గృహహింస కేసు ఇంకా ఫిక్సింగ్ ఆరోపణలు షమీ కెరీర్‌ను కుదిపేశాయి. తర్వాత ఫిక్సింగ్ ఆరోపణల నుంచి బయటపడ్డాడు. ఆ టైంలోనే షమీ ఎంతో మనోవేదనకు గురైనట్లు.. ఆత్మహత్య కూడా చేసుకోవాలని భావించినట్లు తన స్నేహితుడు ఉమేశ్ కుమార్ ఇటీవల ఒక కార్యక్రమంలో చెప్పుకొచ్చాడు.
'ఆ సమయంలో షమీ చాలా సమస్యలతో పోరాడుతున్నాడు. నాతో పాటు అప్పుడు మా ఇంట్లోనే (19వ ఫ్లోర్) నివసించాడు. ఫిక్సింగ్ ఆరోపణలు రావడం దానిపై విచారణ జరగడంతో కుమిలిపోయాడు. 'అన్నింటినీ సహించగలను కానీ నా దేశానికి ద్రోహం చేశానన్న ఆరోపణలు మాత్రం సహించలేనని' నాతో అన్నాడు. ఏదో కఠినమైన నిర్ణయం తీసుకోబోతున్నాడనే వార్తలు కూడా వచ్చాయి. ఆరోజు ఉదయం 4 గంటలకు నీరు తాగేందుకు గది నుంచి బయటకు వచ్చి చూడగా.. షమీ బాల్కనీలో నిల్చొని ఉన్నాడు. మా ఫ్లాట్ 19వ అంతస్తులో ఉంది. అప్పుడే ఏం జరుగుతుందో నాకర్థమైంది. షమీ కెరీర్లోనే ఆ రాత్రి చాలా సుదీర్ఘమైనది.' అని ఉమేశ్ చెప్పాడు. తర్వాత ఒకరోజు తాము మాట్లాడుకుంటున్న సమయంలోనే ఫిక్సింగ్ ఆరోపణలపై దర్యాప్తు చేస్తున్న కమిటీ నుంచి షమీకి క్లీన్ చిట్ మెసేజ్ వచ్చిందని.. అప్పుడు ప్రపంచకప్ గెల్చిన దాని కంటే కూడా ఎక్కువ సంతోషపడి ఉంటాడని షమీ స్నేహితుడు వివరించాడు.