పారిస్ ఒలింపిక్స్ 2024 ప్రారంభ వేడుకలు అట్టహాసంగా పూర్తయ్యాయి. మొత్తం 206 దేశాల నుంచి 10500 మంది అథ్లెట్లు, పలు దేశాల అధినేతలు, ప్రతినిధులతోపాటు లక్షలాదిమంది ప్రేక్షకులు ఈ ఓపెనింగ్ సెర్మనీకి హాజరయ్యారు. ఒలింపిక్స్ ప్రారంభ వేడుకలతో సెన్ నది తీరంలో సందడి వాతావరణం నెలకొంది. ఈ క్రమంలోనే సెన్ నదిలోనే క్రీడాకారుల పరేడ్ సాగింది. ఇక భారత అథ్లెట్ టీంకు నాయకత్వం వహించిన మన తెలుగమ్మాయి పీవీ సింధు.. భారత మువ్వన్నెల జెండాను చేతబట్టి ముందుండి క్రీడాకారులను నడిపింది. మరో అథ్లెట్ శరత్ కమల్‌తో కలిసి ఫ్లాగ్ బేరర్‌గా పీవీ సింధు వ్యవహరించింది. భారత జెండాను పట్టుకుని చీరకట్టు, సాంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోయిన మన క్రీడాకారులను చూసి కోట్లాది మంది భారతీయులు పతకాలు సాధిస్తారని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడూ స్పోర్ట్స్ డ్రెస్‌లో కనిపించే పీవీ సింధు ఇలా చీరకట్టులో కనిపించడంతో అచ్చ తెలుగు అమ్మాయిలా అనిపించింది. అయితే ఈ ఓపెనింగ్ సెర్మనీలో భారత క్రీడాకారులు ధరించిన దుస్తులపై సోషల్ మీడియాలో పలు అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. దుస్తుల నాణ్యత, డిజైన్ సరిగా లేదని.. కామెంట్లు చేస్తున్నారు. ఇక ఆ దుస్తులను భారతీయ ప్రముఖ డిజైనర్ తరుణ్ తహిలియన్‌కి చెందిన లగ్జరీ బ్రాండ్ రూపొందించింది. రెడీ టు వేర్ లేబుల్ తస్వా ఆధ్వర్యంలో ఈ దుస్తులను రూపొందించారు. కాషాయం, ఆకుపచ్చ, తెలుపు రంగులతో త్రివర్ణ పతాకం పోలి ఉండేలా తయారు చేశారు.