పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత్ యువ షూటర్ మను భాకర్ పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు తొలి పతకాన్ని అందించింది. 10 మీటర్ల ఎయిర్‌పిస్టల్ ఫైనల్ మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని సాధించింది. 221.7 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచింది. ఇద్దరు కొరియన్ షూటర్లు తొలి రెండు స్థానాల్లో నిలిచి.. స్వర్ణం, రజత పతకాలు సాధించగా.. భాకర్ కాంస్యం సాధించింది.
ఈ పతకంతో 22 ఏళ్ల మను భాకర్ చరిత్ర సృష్టించింది. 2020 ఒలింపిక్స్‌లో భారీ అంచనాల మధ్య మూడు విభాగాల్లో పోటీ పడిన మను భాకర్.. అన్ని విభాగాల్లోనూ విఫలమై తీవ్రంగా నిరాశపర్చింది. కానీ ఈసారి మాత్రం పోటీపడ్డ తొలి ఈవెంట్‌లోనే కాంస్య పతకాన్ని సాధించి సత్తా చాటింది. మను ఈ ఒలింపిక్స్‌లో ఇంకో రెండు విభాగాల్లోనూ పోటీ పడనుంది.
ఒలింపిక్స్ షూటింగ్ విభాగంలో పతకం సాధించిన తొలి భారత మహిళగా మను భాకర్ రికార్డ్ క్రియేట్ చేసింది. మను భాకర్ ఇప్పటికే తొమ్మిది సార్లు వరల్డ్ కప్ మెడల్స్ సాధించింది. షూటింగ్ విభాగంలో ఒలింపిక్ పతకం సాధించిన ఐదో భారత వ్యక్తిగా మను రికార్డుల్లోకి ఎక్కింది. పారిస్ ఒలింపిక్స్ మొదటి రోజు మహిళల పది మీటర్ల ఎయిర్ పిస్ట్ ఈవెంట్ క్వాలిఫికేషన్ రౌండ్లలో మను భాకర్ మూడోస్థానంలో నిలిచింది. క్వాలిఫికేషన్లో మను భాకర్ అత్యధికంగా 27సార్లు పర్ఫెక్ట్ స్కోర్లు నమోదు చేయడం గమనార్హం.
వ్యక్తిగత విభాగంలో గత 20 ఏళ్లలో ఒలింపిక్ ఫైనల్ చేరిన తొలి భారత అథ్లెట్‌గా మను భాకర్ రికార్డు క్రియేట్ చేసింది. ఇంతకు ముందు సుమా షిరూర్.. 2004లో జరిగిన ఏథెన్స్ ఒలింపిక్స్‌లో పది మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో ఫైనల్ చేరింది.
ఒలింపిక్స్ పతకాలు సాధించిన భారత షూటర్లు..
1. రాజ్యవర్థన్ రాథోడ్ - మెన్స్ డబుల్ ట్రాప్ - 2000 ఏథెన్స్ ఒలింపిక్స్ - రజతం
2. అభినవ్ బింద్రా - 10 మీ. ఎయిర్ రైఫిల్ - 2008 బీజింగ్ - స్వర్ణం
3. గగన్ నారంగ్ - 10 మీ. ఎయిర్ రైఫిల్ - 2012 లండన్ - కాంస్యం
4. విజయ్ కుమార్ - మెన్స్ 25 మీ. రాపిడ్ ఫైర్ పిస్టల్ - 2012 లండన్ - రజతం
5. మను భాకర్ - ఉమెన్స్ 10 మీ. ఎయిర్ పిస్టల్ - 2024 పారిస్ - కాంస్యం