వాల్నట్స్ మెదడు ఆకారంలో ఉండే డ్రై నట్స్. ఆకారానికి తగ్గట్టుగానే వీటిని తీసుకుంటే మెదడు ఆరోగ్యం చాలా బాగుంటుంది. అంతేకాదు గుండె ఆరోగ్యానికి కూడా వాల్నట్స్ తినడం మంచిది.బాదం పప్పు మాదిరిగానే వాల్నట్స్ ను రాత్రి నీళ్లలో నానబెట్టి ఉదయాన్నే తింటుంటారు. అయితే వాల్నట్స్ ను అసలు ఎందుకు నానబెట్టి తినాలి? దీని వల్ల జరిగేదేంటి? నానబెట్టిన వాల్నట్స్ తినడం వల్ల కలిగే ప్రయోజనాలేంటి? తెలుసుకుంటే..
బ్రెయిన్ ఫుడ్..వాల్నట్స్ ను సాధారణంగా బ్రెయిన్ ఫుడ్ గా పిలుస్తారు. ఇందులో ఒమెగా-3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. నానబెట్టిన వాల్నట్స్ తింటే మెదడు పనితీరు మెరుగవుతుంది. జ్ఞాపకశక్తి పెరుగుతుంది. ఇందులో ఉండే కొవ్వులు మెదడు కణాల నిర్వహణకు తోడ్పడతాయి. మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.
డయాబెటిస్..వాల్నట్స్ ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరిచే సామర్థ్యం కలిగి ఉంటాయి. టైప్-2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఉన్నవారికి ఇవి చాలా మంచివి. ఉదయాన్నే నానబెట్టిన వాల్నట్స్ తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. వాల్నట్స్ లో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్, ప్రోటీన్ మొదలైనవి రక్తప్రవాహంలో చక్కెర శోషణను నెమ్మదిస్తుంది.
వృద్దాప్యం..వృద్దాప్యంలోనూ చురుగ్గా, మంచి జ్ఞాపకశక్తితో ఉండటం చాలామంది టార్గెట్. వాల్నట్స్ లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు సెల్యులార్ డ్యామేజ్ కు కారణమయ్యే ఫ్రీ రాడికల్స్ తో పోరాడతాయి. వృద్దాప్య ప్రక్రియను నెమ్మది చేస్తాయి. నానబెట్టిన వాల్నట్స్ తీసుకోవడం వల్ల ఆక్సీకరణ ఒత్తిడి తగ్గుతుంది.
పేగు ఆరోగ్యం..నానబెట్టిన వాల్నట్స్ సులభంగా జీర్ణం కావడమే కాకుండా పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. వాల్నట్స్ ను నానబెట్టడం వల్ల అందులో ఉండే పైటిక్ యాసిడ్, టానిన్లు తగ్గుతాయి. నానబెట్టిన వాల్నట్స్ లో డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది పేగు ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుతుంది. జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది.
ఒమేగా-3వాల్నట్స్ లో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. వాల్నట్స్ ను నానబెడితే ఈ ఒమేగా-3 కంటెంట్ పెరుగుతుంది. శరీరం సులభంగా గ్రహించగలుగుతుంది. శారీరక, మానసిక ఆరోగ్యానికి సహాయపడుతుంది.
కొలెస్ట్రాల్..నానబెట్టిన వాల్నట్స్ కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి. వీటిలో బహుళ అసంతృప్త కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా ఆల్పా-లినోలెనిక్ యాసిడ్ మంచి కొలెస్ట్రాల్ పెంచుతూ చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. ధమనులలో ఫలకం ఏర్పడకుండా నిరోధించి గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.