ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారత్‌లోని చీనాబ్‌ బ్రిడ్జిపై కన్నేసిన పాక్.. చైనా ఆదేశాలతో వివరాల సేకరణ

international |  Suryaa Desk  | Published : Fri, Nov 01, 2024, 09:00 PM

భారత్ పక్కనే ఉంటూ.. మన దేశంపై నిఘా వేసేందుకు నిత్యం పాకిస్తాన్, చైనా కాచుకు కూర్చుంటాయి. తాజాగా ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జి చీనాబ్ వంతెన గురించి పాకిస్తాన్ కన్నేసినట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించినట్లు సంబంధిత వర్గాల ద్వారా తెలుస్తోంది. అయితే ఈ చీనాబ్ వంతెన గురించి సమాచారాన్ని సేకరించాలని పాకిస్తాన్‌కు.. చైనా ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. కానీ ఈ చీనాబ్ వంతెన గురించి చైనా ఎందుకు సమాచారాన్ని సేకరిస్తుంది అనే విషయంపై మాత్రం ఇప్పటివరకు ఎలాంటి స్పష్టత లేదు.


జమ్మూ కాశ్మీర్‌లోని రియాసీ, రాంబన్ ల్లాల మధ్య చీనాబ్ నదిపై నిర్మిస్తున్న ఈ చీనాబ్ వంతెనకు సంబంధించిన వివరాలు సేకరించాలని పాకిస్తాన్‌ను చైనా కోరింది. దీంతో రంగంలోకి దిగిన పాక్ ఇంటెలిజెన్స్‌ వర్గాలు.. ఈ చీనాబ్ బ్రిడ్జి గురించిన కీలకమైన విషయాలు తెలుసుకుంటున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. అయితే ఈ చీనాబ్ వంతెన గురించిన ముఖ్యమైన సమాచారాన్ని పాకిస్తాన్, చైనా ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు సేకరించినట్లు తెలుస్తోంది.


చీనాబ్ వంతెన కంటే ముందు ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెన.. చైనాలో ఉండేది. తాజాగా చీనాబ్ వంతెన నిర్మాణం పూర్తి కావడంతో.. ఆ రికార్డు చీనాబ్ బ్రిడ్జికి దక్కింది. అయితే అందుకోసమే చీనాబ్ విషయాలు తెలుసుకునేందుకు చైనా ఆసక్తి చూపిస్తోందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.


ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన చీనాబ్‌ రైల్వే వంతెన నిర్మాణం దాదాపు పూర్తయింది. ఇటీవలె అధికారులు ఈ చీనాబ్ వంతెనపై రైలు ట్రయల్‌ రన్‌ను కూడా విజయవంతంగా నిర్వహించారు. ఇక ఈ చీనాబ్ బ్రిడ్జి నిర్మించడానికి 20 ఏళ్లు పట్టింది. భారత్‌లోని మిగతా ప్రాంతాలతో కాశ్మీర్‌ను అనుసంధానించేందుకు చేపట్టిన ఈ నిర్మాణాన్ని ఉధంపుర్‌-శ్రీనగర్‌- బారాముల్లా రైల్వే లింక్‌ -యూఎస్‌బీఆర్ఎల్ ప్రాజెక్టులో భాగంగా నిర్మించారు.


ఇప్పటివరకు చైనాలోని బెయిపాన్‌ నదిపై నిర్మించిన 275 మీటర్ల పొడవైన షుబాయ్‌ రైల్వే బ్రిడ్జి పేరుతో ఉన్న వరల్డ్ రికార్డును చీనాబ్ బ్రిడ్జి బద్ధలు కొట్టింది. ఫ్రాన్స్‌లోని పారిస్‌లో ఉన్న ప్రఖ్యాత ఐఫిల్‌ టవర్‌తో పోలిస్తే ఈ చీనాబ్ బ్రిడ్జి ఎత్తు 30 మీటర్లు ఎక్కువగా ఉండటం గమనార్హం. ఇక నదీ గర్భం నుంచి 359 మీటర్ల ఎత్తున ఉన్న ఈ రైల్వే వంతెన పొడవు 1,315 మీటర్లు కావడం విశేషం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com