హోంశాఖను ఉద్దేశించి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపిన సంగతి తెలిసిందే. పిఠాపురం పర్యటనలో భాగంగా ఏపీలో లా అండ్ ఆర్డర్ సమస్యలపై మాట్లాడిన పవన్ కళ్యాణ్.. హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత దీనికి బాధ్యత తీసుకోవాలన్నారు. అలాగే తాను హోంమంత్రిగా బాధ్యతలు తీసుకుంటే.. పరిస్థితి వేరేలా ఉంటుందంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. దీంతో ఏపీలో శాంతిభద్రతలు క్షీణించాయని పవన్ కళ్యాణ్ అంగీకరించారంటూ వైసీపీ శ్రేణులు విమర్శిస్తున్నాయి. మాజీ మంత్రి ఆర్కే రోజా కూడా ఇదే వ్యాఖ్యలు చేశారు. తాము ఎప్పటి నుంచో చెప్తున్న సంగతినే.. పవన్ కళ్యాణ్ ఇప్పుడు చెప్పారని, శాంతిభద్రతల పర్యవేక్షణలో విఫలమైన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోంమంత్రి అనిత తమ పదవులకు రాజీనామా చేయాలని రోజా డిమాండ్ చేశారు.
అయితే మాజీ మంత్రి రోజా.. పవన్ కళ్యాణ్ మీద చేసిన విమర్శలకు జనసేన కౌంటర్ ఇచ్చింది. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ వాస్తవాలే మాట్లాడారని తిరుపతి జనసేన ఇంఛార్జి కిరణ్ రాయల్ అన్నారు. తప్పులుంటే సరిదిద్దుకుంటామని పవన్ కళ్యాణ్ చెప్తే.. రోజాకు ఏం ఇబ్బందని విమర్శించారు. హోంశాఖ తాను తీసుకునే పరిస్థితి తీసుకురావద్దని.. సరిదిద్దుకోవాలని పవన్ కళ్యాణ్ సలహా ఇచ్చారని కిరణ్ రాయల్ చెప్పారు. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా సమస్య వచ్చినప్పుడు దానిమీద మాట్లాడే ఏకైక మగాడు, రాజకీయ నాయకుడు పవన్ కళ్యాణ్ మాత్రమేనని అన్నారు.
పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు రోజా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారంటూ కిరణ్ రాయల్ విమర్శించారు. "చంద్రబాబు, పవన్ కళ్యాణ్, వంగలపూడి అనిత రాజీనామా చేస్తే రోజా వచ్చి కూర్చుంటారా.. అందుకే మాకు 164 సీట్లు ఇచ్చారా. ఇదేమైనా జబర్దస్త్ సీటు అనుకున్నారా.. రాజీనామా చేస్తే వచ్చి కూర్చోవడానికి. ప్రజలు పరిపాలించాలని మాకు 164 సీట్లు ఇచ్చారు. ఏం చేయాలో మాకు తెలుసు. గత ఐదేళ్లలో మీరు ఏంచేశారు. కూటమిలో ఉన్నా, ప్రభుత్వంలో ఉన్నా పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తారు.. దాన్ని అవకాశంగా తీసుకుని పవన్ కళ్యాణ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తారా.. తప్పు జరిగితే కూటమిలోని ఏ పార్టీ నేతలను అయినా ప్రశ్నిస్తాం.. తప్పు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత వారిది." అంటూ కిరణ్ రాయల్ రోజాకు కౌంటర్ ఇచ్చారు.