వైసీపీ సోషల్ మీడియాను సైతాన్ సైన్యంతో ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పోల్చారు. ఈ సైతాన్ సైన్యానికి నాయకుడు జగన్మోహన్‌రెడ్డేనని అన్నారు. ‘సోషల్‌మీడియాలో అసభ్యంగా పోస్టులు చేసిన విషనాగులను పట్టుకుటున్నారు. వాటిని పెంచుతున్న అనకొండను కూడా పట్టుకోవాలి’ అని పరోక్షంగా జగన్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. సోషల్ మీడియాలో తనపై తప్పుడు ప్రచారం చేయించింది జగన్మోహన్ రెడ్డేనని షర్మిల కుండబద్దలు గొట్టారు. మహిళలపైనా, అమ్మ, చెల్లెళ్లపైనా వికృతంగా పోస్టులు పెడుతుంటే ఆపలేదంటే.. వాటి వెనుక జగన్ ఉన్నట్టేకదా అని ప్రశ్నించారు.
మంగళవారం విజయవాడ ఆంధ్రరత్న భవన్‌లో షర్మిల మాట్లాడారు. ‘ప్రతిపక్ష నేత హాదా ఇస్తేనే అసెంబ్లీకి వెళ్తాననడం జగన్‌కు భావ్యమేనా?, నియోజకవర్గంలో గెలిపించిన ప్రజల సమస్యలను అసెంబ్లీ వేదికగా లేవనెత్తాల్సిన బాధ్యత జగన్‌కు లేదా?’ అని నిలదీశారు. అసెంబ్లీలో మైకు ఇవ్వని పరిస్థితి రావడానికి జగన్ స్వయం కృపరాధమని పేర్కొన్నారు. ‘కూటమి ప్రభుత్వం బడ్జెట్‌ను ప్రవేశ పెడితే అసెంబ్లీకి వెళ్లరా? బడ్జెట్ పద్దులపై ప్రతిపక్షంకాక మరెవరు ప్రశ్నిస్తారు? ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగట్టేది ఎవరు?’ అని ప్రశ్నించారు.