కొనసాగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో ప్రశ్నత్తరాల్లో భాగంగా చింతలపూడి ఎత్తిపోతల సాగునీటి ప్రాజెక్ట్ పురోగతిపై ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ప్రశ్నించారు. 2019లో అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును పక్కన పెట్టిందన్నారు. చింతలపూడి ఎత్తిపోతల ఆరు సంవత్సరాలకు ముందు పెట్టిన మొటార్లు నిరుపయోగంగా ఉన్నాయన్నారు.
వీటిని వినియోగానికి తేవడానికి రూ.2000 కోట్లు ఖర్చు చేస్తే సాధ్యమవుతోందని వెల్లడించారు. దీనిపై మంత్రి నిమ్మల రామానాయుడు సమాధానమిస్తూ.. నాలుగు జిల్లాలకు సాగు తాగు నీరు అందించేందుకు చింతలపూడి ఎత్తిపోతలను ప్రారంభించారని తెలిపారు. తెలుగుదేశం హయాంలో రూ.3038 కోట్లు ఖర్చు చేసి 40 శాతం పనులు పూర్తిచేశారన్నారు. అయితే 2019-24లో కేవలం రూ.760 కోట్లు ఖర్చు చేసి కేవలం 5 శాతం పనులను మాత్రమే పూర్తయ్యాయన్నారు. చింతలపూడి ఎత్తిపోతల ఆలస్యానికి గత ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. ప్రస్తుతం సభలో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి.