అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సందర్భంగా ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టుపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి నిమ్మల రామానాయుడు సమాధానం ఇచ్చారు. నదుల అనుసంధానం ద్వారా రాష్ట్రంలో కరువు నివారించాలనేది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యమన్నారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజక్టు వ్యయం 17వేల 50 కోట్లు అని.. ఎనిమిది లక్షల ఎకరాల ఆయకట్టుకు గోదావరి వరద నీరు 63.20 టీఎంసీ లు సరఫరా చేయాలని ప్రతిపాదించామన్నారు.
2019-24 వైసీపీ పాలనలో ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్ట్‌కు రెండు దశల్లో రూ.17050 కోట్లకు పాలనా అనుమతులు ఇచ్చి 5 రూపాయల పని కూడా చేయలేదని విమర్శించారు. ఆర్థిక ఇబ్బందులున్నా రూ.1600 కోట్లతో ఇప్పటికే టెండర్లు పూర్తిచేసి టైం షెడ్యూల్ కూడా ఇచ్చామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మొదటి ప్రాధాన్యత పోలవరం అయితే రెండో ప్రాధాన్యత ఉత్తారాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్ట్ అని చెప్పుకొచ్చారు. వచ్చేనెలలో పనులు ప్రారంభించి 2025 జులై నాటికి గోదావరి వరద జలాలను ఉత్తరాంధ్రకు అందిస్తామన్నారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్ట్ పూర్తి చేసి ఉత్తరాంధ్ర ప్రజల రుణం తీర్చుకుంటామని మంత్రి స్పష్టం చేశారు.