ఏపీ అసెంబ్లీ లాబీలో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో పలు ఆసక్తికర విషయాలు తెలియజేశారు. ఈ సందర్భంగా వైసీపీ హయాంలో వారిపై నమోదు అయిన అక్రమ కేసులకు సంబంధించి మీడియాకు తెలియజేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన ఆగడాలను గుర్తుచేశారు. వైసీపీ పాలనలో చట్టాన్ని దుర్వినియోగం చేశారని విమర్శించారు. తమపై కేసు పెట్టి అధికారులంతా ఇప్పుడు హాయిగా ఉద్యోగాలు చేసుకుంటున్నారని చెప్పారు.
కాగా.. వైసీపీ హయాంలో ఎమ్మెల్యే చింతమనేనిపై 27 అక్రమ కేసులు నమోదు అవగా.. పల్లె రఘునాథ్ రెడ్డిపై 14 అక్రమ కేసులు నమోదు అయ్యాయి. తన కోడలి రాజకీయ జీవితంపైనా పల్లె రఘునాథ్ రెడ్డి పలు ఆసక్తికర విషయాలు తెలియజేశారు. ఎమ్మెల్యే చింతమనేని మాట్లాడుతూ.. గత ఐదేళ్లలో తనపై వైసీసీ ప్రభుత్వం 27 అక్రమ కేసులు పెట్టిందన్నారు. నిన్న రెండు కేసులను న్యాయస్థానం తప్పని కొట్టేసిందన్నారు. మరో 25 అక్రమ కేసులు తనపై ఉన్నాయన్నారు. ‘‘నాపై అక్రమ కేసులు పెట్టిన అధికారులంతా ఎక్కడెక్కడో ప్రశాంతంగా ఉద్యోగాలు చేసుకుంటున్నారు. నన్ను వేధించిన అధికారులే కావాలంటూ మా నాయకులే వారికి మంచి పోస్టింగ్‌లు ఇప్పించుకున్నారు’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ చట్టాల విలువ తీసేసేలా అక్రమ కేసులతో చట్టాన్ని వైసీపీ దుర్వినియోగం చేసిందని విమర్శించారు. నిన్న తనపై కొట్టేసిన రెండు కేసులు కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం దుర్వినియోగం చేసి పెట్టినవే అని తెలిపారు. కేసులో బాధితులుగా తనతో పాటు ఎస్సీలూ ఉండటం గమనార్హమని ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పేర్కొన్నారు.