విశాఖ జిల్లా, కొయ్యూరు మండలంలోని బకులూరు గ్రామ శివారు జీడిమామిడి తోటల్లో గురువారం అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతదేహాన్ని గ్రామస్థులు గుర్తించారు. అనంతరం కొయ్యూరు పోలీసులకు సమాచారం అందించారు. ఎస్ఐ కిశోర్వర్మ, పోలీసు సిబ్బంది కలసి సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. మృతదేహంపై కప్పిన జీడిమామిడి కొమ్మలు తొలగించి చూసిన పోలీసులు.. గూడెంకొత్తవీధి మండలం ఎర్ర చెరువులు గ్రామానికి చెందిన బూసరి ధనుంజయ్దిగా గుర్తించారు. మృతదేహం ఉబ్బిపోయి దుర్వాసన వస్తుండడంతో మూడు, నాలుగు రోజుల క్రితం ఇతను మృతిచెందడం లేదా హత్యకు గురికావడం జరిగి వుంటుందని పోలీసులు భావిస్తున్నారు.
ఎర్రచెరువులు గ్రామానికి చెందిన బూసరి లక్ష్మయ్య కుమార్తె మాధవి, బకులూరుకు చెందిన వ్యక్తిని వివాహం చేసుకుంది. ఈమె తమ్ముడు అయిన ధనుంజయ్ అక్కను చూసేందుకు వారం రోజుల క్రితం ఇక్కడకు వచ్చాడు. మద్యపానం అలవాటు వున్న ధనుంజయ్ 12వ తేదీ రాత్రి పది గంటల సమయంలో అక్క ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు అందలేదు. ఈ నేపథ్యంలో గురువారం జీడిమామిడి తోటల్లో శవమై కనిపించాడు. ధనుంజయ్ది హత్యా? ఆత్మహత్యా? సాధారణ మరణమా? అన్న కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని కొయ్యూరు సీఐ వెంకటరమణ తెలిపారు.