రోజ్ సొసైటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో విజయవాడ నగరపాలక సంస్థ, అర్బన్ గ్రీనరీ, ఉద్యానవన శాఖ సహకారంతో ఈనెల 22 నుంచి 25వ తేదీ వరకు పిన్నమనేని పాలీక్లినిక్ రోడ్డులోని సిద్ధార్థ హోటల్ మేనేజ్‌మెంట్ కళాశాల మైదానంలో ఫల, పుష్ప ప్రదర్శన-2024 నిర్వహిస్తున్నట్లు సంస్థ అధ్యక్షురాలు ఎస్.ఉషారాణి, కార్య దర్శి జి.లక్ష్మి తెలిపారు. గురువారం టిక్కిల్ రోడ్డులోని రోజ్ సొసైటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మాజీ అధ్యక్షురాలు ఎ.వి.సీతామహాలక్ష్మి నివాసంలో ప్రదర్శనా పోస్టర్‌ను వారు ఆవిష్కరించారు.
రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి చేమంతులు, గులాబీలతో పాటు దేశీయ, అంతర్జాతీయ పూలమొక్కలు, పలు రకాల పండ్ల మొక్కలు, గార్డెన్ అలంకరణ వస్తువులు, పరికరాలు, పూల కుండీలు, ఆర్గానిక్ ఎరువులు, ఆర్గానిక్ ఆహార పదార్థాలు ఈ ప్రదర్శనలో అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఈ ప్రదర్శనలో 95 స్టాల్స్‌కు పైగా ఏర్పాటు చేస్తున్నామని అందులో రైతుల స్టాల్స్ కూడా ఉంటాయని తెలిపారు. పర్యావరణ పరిరక్షణపై విద్యార్థుల్లో అవగాహన కల్పించేందుకు ఈ ప్రదర్శనలో నాలుగు రోజులు పలు పాఠశాలల విద్యార్థులతో సాంస్కృతిక కార్యక్రమాలు, పలు రకాల పోటీలు నిర్వహిస్తామన్నారు. ఇక్కడకు వచ్చే సందర్శకులకు కొన్ని రకాల విత్త నాలు, మొక్కల నారు ఉచితంగా అందజేస్తామని తెలిపారు.