ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ప్రధాని మోదీ.. నెటిజెన్ తాతను కలిసి ఆప్యాయంగా మాట్లాడి!

national |  Suryaa Desk  | Published : Sat, Dec 21, 2024, 07:50 PM

ప్రధాని నరేంద్ర మోదీ రెండ్రోజుల పాటు కువైట్ పర్యటనకు వెళ్తున్న విషయం అందరికీ తెలిసిందే. అందరిలాగే వార్తలు చూసి ఈ విషయం తెలుసుకున్న ఓ నెటిజెన్.. ప్రధాని మోదీకి ఓ విన్నపం తెలిపింది. కువైట్‌లో ఉన్న తన తాతను కలవాలని చెప్పింది. ఆయన వివరాలను కూడా పంపించినట్లు పేర్కొంది. ఇది చూసిన ప్రధాని అందుకు ఓకే చెప్పారు. ఈక్రమంలోనే ఈరోజు కువైట్ చేరుకున్న మోదీ.. వెళ్లగానే నెటిజెన్ తాతను కలిసి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. ఆయనను ఆప్యాయంగా పలకరించి మరీ.. నవ్వుతూ ఫొటోలకు ఫోజులు ఇచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఆ విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.


ప్రధాని నరేంద్ర మోదీ కువైట్ వెళ్తున్నట్లు తెలుసుకున్న నెటిజెన్ శ్రేయా జునైజా శుక్రవారం రోజు ఆయనకు తన మనసులో ఉన్న ఓ విన్నపాన్ని వివరించింది. ఎక్స్ వేదికగా.. కువైట్‌లో ప్రవాస భారతీయులతో ఆత్మయ సమావేశంలో పాల్గొంటారు కదా.. అందులో పాల్గొనే మా తాత, 101 ఏళ్ల మంగళ్ సేన్ హండాను మీరు కలవాల్సిందిగా కోరుతున్నానంటూ చెప్పుకొచ్చింది. అలాగే ఆయన గతంలో ఇండియన్ ఫారిన్ సర్వీస్‌లో పని చేసినట్లు శ్రేయా జునేజా వివరించింది. తన తాతకు మీరంటే చాలా అభిమానం అని తెలిపింది. అలాగే తన తాత వివరాలను ప్రధాని కార్యాలయానికి కూడా పంపినట్లు వెల్లడించింది.


శ్రేయా జునేజా అభ్యర్థన చూసిన ప్రధాని మోదీ.. కచ్చితంగా కలుస్తానంటూ ఆమెకు ఎక్స్ వేదికగా రిప్లై ఇచ్చారు. ఇచ్చిన మాట ఫ్రకారం కువైట్‌లో.. ఆమె తాత 101 ఏళ్ల మంగళ్ సేన్ హండాను మోదీ కలిశారు. ఆప్యాయంగా పలకరించారు. ఆపై తన మనవరాలు చేసిన అభ్యర్థన గురించి ఆయనకు చెప్పారు. అంతేకాకుండా.. హండాను కలవడం కోసమే తాను కువైట్ వచ్చినట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.


అయితే ప్రధాని నరేంద్ర మోదీకి.. మంగళ్ సేన్ హండా ముందు నుంచే తెలుసు. ఆయనపై మోదికి మక్కువ ఎక్కువ. 2023లో జరిగిన హండా 100వ పుట్టిన రోజున ఓ లేఖను కూడా పంపారు. అందులో హండా ఐఎఫ్ఎస్ అధికారిగా ఉన్నప్పుడు దేశానికి అందించిన సేవల గురించి వివరించారు. అలాగే ప్రపంచంలోని సంక్లిష్టమైన సమస్యల కోసం ఆయన చేసిన కృషిని వెల్లడించారు. దాన్ని హండా ఎక్స్ వేదికగా షేర్ చేస్తూ.. ప్రధానికి కృతజ్ఞతలు చెప్పుకొచ్చారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com