జగన్ నాయకత్వంలోని వైసీపీ నుంచి మరో నేత బయటికి వచ్చారు. మాజీ ఐఏఎస్ అధికారి, కర్నూలు వైసీపీ ఇన్చార్జి ఇంతియాజ్ అహ్మద్ పార్టీకి గుడ్ బై చెప్పారు. వైసీపీకి రాజీనామా చేస్తున్నట్టు ఆయన ఇవాళ ప్రకటించారు. ఇకపై రాజకీయాలకు దూరంగా ఉంటానని స్పష్టం చేశారు. కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సూచన మేరకే రాజీనామా చేశానని వెల్లడించారు. ఇక మీదట సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటానని ఇంతియాజ్ అహ్మద్ తెలిపారు. గత ఎన్నికల్లో ఇంతియాజ్ అహ్మద్ కర్నూలు ఎమ్మెల్యే అభ్యర్థిగా వైసీపీ తరఫున పోటీ చేశారు. అయితే ఆ ఎన్నికల్లో ఆయన ఓటమిపాలయ్యారు. 2019లో వైసీపీ గెలిచాక ఇంతియాజ్ అహ్మద్ కృష్ణా జిల్లా కలెక్టర్ గా పనిచేశారు. పదవీ విరమణ సమయం సమీపిస్తుండడంతో, ఆయన రాజకీయాలపై ఆసక్తి ప్రదర్శించారు. దాంతో, జగన్ ఆయనను పార్టీలోకి తీసుకోవడమే కాకుండా, కర్నూలు సిట్టింగ్ ఎమ్మెల్యేను సైతం కాదని టికెట్ కేటాయించారు. కానీ కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఇంతియాజ్ అహ్మద్ ఓటమిపాలయ్యారు. ఈ స్థానంలో టీడీపీ నుంచి టీజీ భరత్ విజయం సాధించారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత ఇంతియాజ్ అహ్మద్ పార్టీ కార్యకలాపాల్లో పెద్దగా కనిపించింది లేదు.