తిరుపతిలోని వెంకటేశ్వర అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఓ విద్యార్థినిపై వేధింపుల పర్వం వెలుగుచూసింది. ఓ విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపిస్తూ విద్యార్థులంతా కలిసి ఆందోళనకు దిగారు. ప్రొఫెసర్‌ను విధుల నుంచి తప్పించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. దీంతో యూనివర్సిటీలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రొఫెసర్ వేధింపులపై విద్యార్థినులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. వెంకటేశ్వర అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఓ విద్యార్థినిని ప్రొఫెసర్ ఉమా మహేష్ అసభ్యంగా వేధింపులకు గురిచేశాడు.
వేధింపులు ఎక్కువ అవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సదరు ప్రొఫెసర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతపురం జిల్లాకు చెందిన మొదటి సంవత్సరం సెకండ్ సెమిస్టర్ చదువుతున్న విద్యార్థిని పట్ల అసభ్యంగా ఫ్రొఫెసర్ ప్రవర్తించాడు. క్లాస్ రూమ్‌లో ఒంటరిగా ఉన్న విద్యార్థినిని సెక్సువల్‌గా వేధింపులకు ప్రొఫెసర్ ఉమా మహేష్ గురిచేశాడు. విద్యార్థినిని వేధించిన విషయం తల్లిదండ్రులకు తెలపడంతో రూరల్ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్‌లో క్రైమ్ నెంబర్ 466/2024 కేసు నమోదు చేశారు. యూనివర్సిటీ ఫ్లై ఓవర్ వద్ద ఉన్న ఉమా మహేష్‌ను తిరుపతి రూరల్ సీఐ చిన్న గోవింద్ అరెస్టు చేశారు. ప్రొఫెసర్ ఉమా మహేష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఈ విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. గతంలో ప్రొఫెసర్ ఉమా మహేష్‌పై ఏమైనా కేసులు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. గతంతో అతను పనిచేసిన కాలేజీల్లో కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు.