శీతాకాలంలో ఢిల్లీని వర్షాలు ముంచెత్తుతున్నాయి. తాజాగా కురుస్తున్న భారీ వర్షాలకు ఢిల్లీలోని పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఇక మరికొన్ని చోట్ల భారీ వర్షాలు పడతాయని పేర్కొన్న భారత వాతావరణ శాఖ అధికారులు.. ఆ ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఇక ఢిల్లీలో ఎన్నడూ లేని విధంగా వానలు దంచి కొడుతున్నాయి. కేవలం గత 24 గంటల్లోనే 41.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావడం.. ఢిల్లీలో కురుస్తున్న భారీ వర్షాలకు నిదర్శనం. అయితే డిసెంబర్ నెలలో ఇంతటి వర్షాలు కురవడం 101 సంవత్సరాల్లో ఇదే తొలిసారి అని ఐఎండీ అధికారులు వెల్లడించారు.
ఇక ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో శనివారం కూడా ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. శనివారం ఉదయం 8:30 గంటల వరకు గత 24 గంటల్లో 41.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు పేర్కొన్నారు. డిసెంబర్ నెలలో ఇలాంటి వాన గతంలో 1923 డిసెంబర్ 3వ తేదీన నమోదైనట్లు గణాంకాలు వెల్లడించారు. అప్పట్లో ఒకేరోజు 75.7 మిల్లీమీటర్ల వర్షం కురిసిందని.. దాంతో ఢిల్లీ నగరం అతలాకుతలం అయిందని పేర్కొన్నారు.
అయితే ఓ వైపు భారీ వర్షాలు కురిసినా.. ఢిల్లీ వాసులకు కాస్త ఉపశమనం కలిగించే విషయం ఏదైనా ఉందంటే.. అది గాలి నాణ్యత కొంత మెరుగుపడటమే. ఇక ఎప్పటిలాగే ప్రతీసారి శీతాకాలం రాగానే ఢిల్లీలో గాలి కాలుష్యం పరిస్థితి ఏ విధంగా ఉంటుందో అర్థం అవుతూనే ఉంది. అధికారుల లెక్కల ప్రకారం శనివారం ఉదయం 11 గంటలకు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్- ఎక్యూఐ 142తో నాణ్యత కొద్దిగా పెరగడానికి వర్షపాతం ఉపయోగపడిందని పేర్కొన్నారు. ఈ వర్షం కారణంగా ఢిల్లీలో గాలి నాణ్యత కొంత మెరుగైందని సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ తెలిపింది.
ఇక శుక్రవారం సాయంత్రం 5:30 గంటల వరకు ఢిల్లీ నగరవ్యాప్తంగా 31.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు ఐఎండీ వెల్లడించింది. పాలెం వద్ద 31.4 మిల్లీమీటర్లు, లోథి రోడ్‌లో 34.2 మిల్లీమీటర్లు, రిడ్జ్‌లో 33.4 మిల్లీమీటర్లు, ఢిల్లీ యూనివర్సిటీలో 39 మిల్లీమీటర్లు, పూసాలో 35 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు తెలిపింది. ఇక ఈ వీకెండ్‌కు ఢిల్లీలోని పలు ప్రాంతాలకు ఐఎండీ.. ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
మరోవైపు.. ఢిల్లీతోపాటు రాజధాని ప్రాంతంలో కురిసిన ఈ భారీ వర్షానికి మరికొన్ని రోజులు ఉష్ణోగ్రతలు పడిపోతాయని ఐఎండీ అంచనా వేసింది. ఢిల్లీలో గరిష్ట ఉష్ణోగ్రత 16 డిగ్రీల సెల్సియస్ ఉంటుందని.. కనిష్ట ఉష్ణోగ్రత 12 డిగ్రీల సెల్సియస్ ఉండవచ్చని తెలిపింది. మరోవైపు.. కుండపోతగా కురుస్తున్న వర్షం కారణంగా ఢిల్లీలో ఎక్కడికక్కడ నీళ్లు నిలిచిపోయి.. ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి. ఆర్‌కె పురం సెక్టార్-9లో రోడ్డు కొంత భాగం కుంగిపోవడంతో కారు, బైక్ మ్యాన్‌హోల్‌లో పడిపోయినట్లు అధికారులు తెలిపారు.