ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పీవీ అంత్యక్రియలు ఢిల్లీలో జరపాలని కాంగ్రెస్ భావిస్తే.. కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదా..?

national |  Suryaa Desk  | Published : Sun, Dec 29, 2024, 08:25 PM

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ భౌతిక కాయానికి ప్రభుత్వ లాంఛనాలతో ఢిల్లీలోని నిగమ్‌బోధ్ ఘాట్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రధానిగా పని చేసిన ఏకైక వ్యక్తి పీవీ నర్సింహారావు అంత్యక్రియల విషయమై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. 1991 నుంచి 1996 వరకు భారత ప్రధానిగా పని చేసిన పీవీ.. 2004 డిసెంబర్ 23న ఢిల్లీలోని ఎయిమ్స్‌లో మరణించగా.. హైదరాబాద్‌లో అంత్యక్రియలు నిర్వహించారు.


క్లెయిమ్ ఏంటి..?


పీవీ నర్సింహారావు అంత్యక్రియలను ఢిల్లీలో నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ అనుకున్నప్పటికీ.. పార్థీవ దేహాన్ని హైదరాబాద్ తీసుకెళ్లాలని ఆయన కుటుంబ సభ్యులు నిర్ణయించారని ఎక్స్ యూజర్ మనీశ్ సింగ్ తన పోస్టులో పేర్కొన్నారు. ‘‘కాంగ్రెస్ నాయకులు పీవీ కుటుంబ సభ్యులకు నచ్చజెప్పడానికి ప్రయత్నించినప్పటికీ.. వారు ఒప్పుకోలేదు, సాధ్యమైనంత త్వరగా పార్థీవ దేహాన్ని హైదరాబాద్ తరలించాలని కోరారు. ఆ తర్వాత అకస్మాత్తుగా పీవీ డెడ్ బాడీని కొద్ది సేపు కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో ఉంచాలని వారు కోరారు. దీనికి ఏర్పాట్లు పూర్తి కాక ముందే పీవీ కుటుంబీకులు ఆయన పార్థీవదేహాన్ని తీసుకొని కాంగ్రెస్ హెడ్‌క్వార్టర్స్‌కు చేరుకున్నారు. సహజంగానే తాళం తీయడంలో ఆలస్యమైంది. దీంతో ఆగ్రహించిన పీవీ కుటుంబ సభ్యులు కారు తీసుకొని ఎయిర్‌పోర్టుకు వెళ్లారు. హైదరాబాద్‌లో అంత్యక్రియల సమయంలో వర్షం కురిసిందని.. సగం కాలిన శరీరాన్ని కుక్కలు పీకేశాయి’’ అని మనీశ్ సింగ్ హిందీలో రాసిన తన పోస్టులో పేర్కొన్నారు.


వాస్తవమేంటి..?


నరసింహారావు మరణానంతరం ఆయన భౌతికకాయం పట్ల కాంగ్రెస్ పార్టీ, ముఖ్యంగా సోనియా గాంధీ అనుచితంగా ప్రవర్తించారని మీడియాలో కథనాలు రావడంతోపాటు.. పుస్తకాల్లోనూ ప్రచురితమైంది. ఈ విషయమై అనేక వ్యాసాలు రాయడంతోపాటు కొన్ని పుస్తకాలు కూడా ఈ విషయాన్ని ప్రస్తావించాయి. పీవీ కుటుంబ సభ్యుల వాంగ్మూలాలు కూడా రికార్డుల్లో ఉన్నాయి. వినయ్ సీతాపతి రాసిన ప్రసిద్ధ పుస్తకం 'హాఫ్ లయన్' నరసింహారావు అంత్యక్రియల మొత్తం సంఘటనను వివరంగా వివరిస్తుంది. ఈ పుస్తకం నుంచి అంత్యక్రియల సారాంశాన్ని ఫస్ట్‌పోస్ట్ ప్రచురించింది. ప్రిన్స్‌టన్ స్కాలర్ అయిన వినయ్ సీతాపతి.. పీవీ పర్సనల్ డాక్యుమెంట్లు, పత్రాలకు స్పెషల్ యాక్సెస్ కలిగి ఉన్నారు.


ఢిల్లీలో అంత్యక్రియలు చేయొద్దన్న కాంగ్రెస్ నేతలు..


పీవీ మృతదేహానికి హైదరాబాద్‌లోనే అంత్యక్రియలు నిర్వహించాలని పీవీ చిన్న కుమారుడు ప్రభాకర్‌కు నాటి హోంమంత్రి శివరాజ్‌పాటిల్‌ సూచించారు. కానీ కుటుంబం మాత్రం ఢిల్లీకే ప్రాధాన్యం ఇచ్చింది. ‘పీవీ చివరిగా 30 ఏళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పని చేశారు, అప్పటి నుంచి ఆయన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా, కేంద్ర మంత్రిగా.. చివరకు ప్రధానమంత్రిగా మొత్తం ఢిల్లీలోనే పనిచేశారు’ అని ప్రభాకర్ రావు చెప్పగా.. అది విన్న శివరాజ్ పాటిల్ మెల్లగా.. అంత్యక్రియలకు ఎవరూ రారు అన్నారని ఫస్ట్ పోస్ట్ కథనంలో పేర్కొన్నారు.


‘గేటు’ తెరవకపోవడం వెనుక అసలు కథ ఇది


సోనియా గాంధీ మరో సహాయకుడు గులాం నబీ ఆజాద్.. మృతదేహాన్ని హైదరాబాద్‌కు తీసుకెళ్లాలని పీవీ కుటుంబ సభ్యులను కోరారు. పీవీ మృతదేహం 24, అక్బర్ రోడ్‌లోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయానికి చేరుకోగానే, ప్రవేశ ద్వారం మూసివేసి ఉంది. దివంగత కాంగ్రెస్ నేత మాధవరావు సింధియా మృతదేహానికి కొన్నేళ్ల క్రితమే గేటు తెరిచినా.. ఆ మర్యాద మాత్రం పీవీ పట్ల చూపలేదు. పీవీ స్నేహితుడు మృతదేహాన్ని లోపలికి అనుమతించమని కాంగ్రెస్ సీనియర్ మహిళను కోరగా, ఆమె 'గేటు తెరుచుకోవడం లేదు' అని బదులిచ్చారు. ఇది అబద్ధం. కొన్నాళ్ల క్రితం మాధవరావు సింధియా మరణించినప్పుడు గేటు తెరిచారని కూడా ఫస్ట్ పోస్ట్ కథనంలో రాశారు.


అరగంట వేచి ఉన్నా..


కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలోకి పీవీ మృతదేహాన్ని ఎందుకు అనుమతించడం లేదని నాటి ప్రధాని మన్మోహన్ సింగ్‌ను ప్రశ్నించగా, తాను అక్కడ ఉన్నానని, అయితే దాని గురించి సమాచారం లేదని బదులిచ్చారు. దీనిపై మరో కాంగ్రెస్ నేత బహిరంగంగా మాట్లాడారు. గేటు తెరుస్తారని అనుకున్నాం.. కానీ ఆర్డర్ రాలేదు. ఒక వ్యక్తి మాత్రమే ఆ ఆర్డర్ ఇవ్వగలరు. 'ఆమె ఆర్డర్ ఇవ్వలేదు' అని ఆయన చెప్పారు. ఆర్డర్ ఇవ్వనిది మరెవరో కాదు సోనియా గాంధీ. ఆర్మీ వాహనం దాదాపు 30 నిమిషాల పాటు హెడ్ క్వార్టర్స్ వెలుపల వెయిట్ చేసి, ఆ తర్వాత విమానాశ్రయం వైపు వెళ్లింది.


అంత్యక్రియలకు హాజరు కాని సోనియా


పీవీ క్యాబినెట్‌లో ఆర్థిక మంత్రిగా పని చేసి.. భారతదేశాన్ని మార్చే విప్లవాత్మక సంస్కరణలకు నాంది పలికిన మన్మోహన్ సింగ్.. పీవీ మరణం తర్వాత వ్యవహరించిన తీరు పట్ల అసంతృప్తిగా ఉన్నారని సమాచారం ఉంది. హైదరాబాద్‌లోని హుస్సేన్ సాగర్ తీరాన జరిగిన అంత్యక్రియలకు మన్మోహన్ హాజరయ్యారు. బీజేపీ నేత అద్వానీ కూడా పీవీ అంత్యక్రియలకు హాజరయ్యారు. అయితే సోనియా గాంధీ మాత్రం అంత్యక్రియలకు దూరంగా ఉండటానికే మొగ్గు చూపారు.


సగం కాలిన మృతదేహాన్ని కుక్కలు పీకాయా?


“ఒక రెండు గంటల తర్వాత ప్రముఖులు వెళ్లిపోయాక.. పీవీ శరీరం ఇంకా కాలుతోంది. ఆ రాత్రి స్థానిక టెలివిజన్ ఛానెల్‌లు సగం కాలిపోయిన శరీరం, పుర్రె కనిపిస్తోన్న దృశ్యాలను చూపించాయి. అంత్యక్రియల చితి వద్ద వీధికుక్కలు లాగుతున్నాయి’’ అని హాఫ్ లయన్‌లో పేర్కొన్నారు.


 


మాజీ ప్రధాని పీవీ నరసింహారావు సగం కాలిన శరీరం ఫొటోలు బయటకొచ్చినట్లు న్యూస్ ఏజెన్సీ IANS 2004 డిసెంబర్ 26న పేర్కొంది. పీవీ సగం కాలిన ఎముకలు, పుర్రె మరియు ఇతర శరీర భాగాల దిగ్భ్రాంతికర ఫొటోలను తెలుగు టీవీ ఛానెల్స్ శనివారం రాత్రి 11 గంటల సమయంలో ప్రసారం చేశాయని తెలిపింది.


శరీరం ఎందుకు సగం కాలిపోయింది?


మాజీ ప్రధాని పీవీ అంత్యక్రియలకు సరిపడా కట్టెలను ఏర్పాటు చేయకుండా అధికారులు ఆయన పట్ల ఎలా అగౌరవం ప్రదర్శించారో.. ప్రత్యక్ష సాక్షులను ఉటంకిస్తూ టీవీ రిపోర్టులు హైలెట్ చేశాయి. అప్పటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి.. టీవీ ఛానెల్‌లు అటువంటి చిత్రాలను ప్రసారం చేయడం.. ‘గొప్ప వ్యక్తిని అవమానించడమే కారణంతో’ అసంతృప్తి వ్యక్తం చేశారు. టీవీలో చాలా చెత్త విజువల్స్ వస్తున్నాయని 11 గంటల సమయంలో తన సోదరి చెప్పిందని నరసింహారావు కుమారుడు చెబుతున్నాడు. సగం కాలిన శరీరాన్ని కుక్కలు చింపివేస్తున్నట్లు టీవీలో చూశాడు.


మార్గరెట్ ఆల్వా తన పుస్తకంలో ఏం రాశారు?


కాంగ్రెస్ నాయకురాలు మార్గరెట్ ఆల్వా తన ఆత్మకథలో పీవీ మృతదేహాన్ని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో ఉంచని విషయాన్ని ప్రస్తావించారు. 2016లో ప్రచురితమైన ఈ పుస్తకంలో పీవీ మృతదేహం చాలా బరువెక్కిందని, దానిని గన్ క్యారేజీ నుంచి పైకి లేపి కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో ఉంచడం కష్టమని ఆమె రాశారు. ఏది ఏమైనా నరసింహారావు భౌతికకాయాన్ని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం బయట నుంచి హైదరాబాద్‌కు పంపించారు.


బాబ్రీ కూల్చివేతతో సోనియా కలత


1992, డిసెంబర్ 6న అయోధ్యలో వివాదాస్పద బాబ్రీ మసీదు నిర్మాణం కూల్చివేతకు గురికాగా.. కేంద్రంలోని పీవీ నరసింహారావు ప్రభుత్వం పాత్ర సంతృప్తికరంగా లేదనే అభిప్రాయం ఉంది. అందుకే పీవీ మృతదేహానికి గౌరవం ఇస్తే ముస్లిం ఓటర్లు కాంగ్రెస్ పార్టీపై ఆగ్రహం వ్యక్తం చేసే అవకాశం ఉందని సోనియా సలహాదారులు తెలిపారు. పీవీని ప్రధానిని చేసిన సోనియా.. ఆయన తన కింద పనిచేస్తారని భావించారు. ఇది కొన్ని నెలల పాటు జరిగింది, కానీ తరువాత పీవీ.. సోనియాకు రిపోర్ట్ చేయడం మానేశారు.


కాంగ్రెస్ నాయకుడు మణిశంకర్ అయ్యర్.. పీవీపై ఎలా విషం చిమ్మారో ఏడాది క్రితం దైనిక్ భాస్కర్ నివేదిక స్పష్టంగా చూపిస్తుంది. పీవీని కమ్యూనల్ అని, బీజెపీ మొదటి ప్రధాన మంత్రి అని అయ్యర్ అభివర్ణించారు. నరసింహారావును కాంగ్రెస్ వాళ్లు ఎంతగా ద్వేషిస్తారో మనీశ్ సింగ్ స్వయంగా తన పోస్ట్‌లో వెల్లడించారు. పీవీ అంత్యక్రియల సమయంలో వర్షం కురిసింది. మరుసటి రోజు ఉదయం కుక్కలు సగం కాలిపోయిన శరీరాన్ని లాగడం కనిపించింది. ఇది దైవ న్యాయం. 1991లో ఢిల్లీ అల్లర్ల సమయంలో కేంద్ర హోంమంత్రిగా.. అంటే ఢిల్లీ పోలీసు ఇన్‌చార్జిగా ఉండి, 1991లో మతపరమైన స్థలాన్ని కూల్చివేతలో రహస్య ప్రమేయం ఉన్న ప్రధాని నుదుటిపై ఈ విధి రాత రాసి ఉంది.' అని మనీశ్ సింగ్ తన పోస్టులో పేర్కొన్నారు.


అసలు వాస్తవం ఇదే...?


పీవీ అంత్యక్రియల విషయంలో ఎక్స్ యూజర్ మనీష్ సింగ్ వాదన తప్పు, నిరాధారమైనది. ఈ పోస్టులో పేర్కొన్న దానికి భిన్నంగా.. కాంగ్రెస్ నాయకులు పీవీ మృతదేహాన్ని హైదరాబాద్‌కు తీసుకెళ్లాలని ఒత్తిడి తెచ్చారు, అయితే కుటుంబ సభ్యులు మాత్రం ఢిల్లీలో అంత్యక్రియలు నిర్వహించాలని కోరుకున్నారు. ఢిల్లీలో అంత్యక్రియలు నిర్వహిస్తే కాంగ్రెస్ సభ్యులెవరూ రాలేరని శివరాజ్ పాటిల్.. రావు కుటుంబసభ్యులకు స్పష్టంగా చెప్పారు. అదేవిధంగా, తగినంత కలప లేకపోవడంతో పీవీ పార్థీవదేహం సగం కాలిపోయింది. అంతే కానీ వర్షం కారణంగా కాదు. నరసింహారావు అంత్యక్రియలకు సంబంధించిన సంఘటనలను మీరు ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ నుంచి కూడా తెలుసుకోవచ్చు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com