దేశ భాషలందు తెలుగు లెస్స అన్నారు విజయనగర సామ్రాజ్యాధీశులు శ్రీకృష్ణ దేవరాయలు. ఆయన అన్నట్టుగానే తెలుగు భాషకు దేశవ్యాప్తంగానే కాకుండా అంతర్జాతీయంగానూ మంచి గుర్తింపు ఉంది. ఇక తెలుగు వాళ్లు అయితే ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా కనిపిస్తారు. ప్రపంచం నలుమూలలా విస్తరించిన తెలుగు వాళ్లు తమతోపాటు తెలుగు భాష సొబగులను కూడా ఆయా ప్రాంతాలకు తీసుకెళ్లారు. తెలుగు రాష్ట్రాల ఆవల కొన్ని ప్రాంతాలకు వెళ్తే మన తెలుగు నాట ఉన్నామా..? లేదంటే పరాయి భాష మాట్లాడే ప్రాంతంలో ఉన్నామా? అనే అనుమానం రాక మానదు. తెలుగు వాళ్ల ప్రాబాల్యాన్ని దృష్టిలో ఉంచుకొని తెలుగు భాషను ఇతర రాష్ట్రాలు సైతం గుర్తించి, గౌరవిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియాలో తెలుగు భాష గురించి ఓ పోస్టు ఆసక్తికరంగా కనిపించింది.
క్లెయిమ్ ఏమిటి..?
బెంగాల్ లో తెలుగు అధికార భాష అనే క్యాప్షన్‌తో.. పశ్చిమ బెంగాల్‌లో స్థిరపడిన తెలుగువారి సుదీర్ఘ పోరాట ఫలితంగా అక్కడి ప్రభుత్వం తెలుగును అధికార భాషగా గుర్తించింది. కోల్‌కతా, 24 పరగణాలు, మిడ్నాపూర్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో తెలుగువారు పెద్ద సంఖ్యలో ఉన్నారు’ అంటూ ఉన్న ఓ స్క్రీన్ షాట్‌ను ఈ వ్రాతలే.... (X/vraatalu) అనే యూజర్ డిసెంబర్ 28న ఎక్స్‌లో పోస్టు చేశారు.
వాస్తవమేంటి..?
బెంగాల్‌లోని పలు ప్రాంతాల్లో తెలుగు ప్రజలు పెద్ద సంఖ్యలో ఉన్నది నిజమే. అలాగే తెలుగును బెంగాల్ ప్రభుత్వం అధికార భాషగా గుర్తించింది కూడా నిజమే. బెంగాల్‌లో తెలుగు అధికార భాష అని గూగుల్‌లో వెతకగా.. V6 వెలుగు, ఆంధ్రజ్యోతి, దిశ, సమయం తెలుగు లాంటి ప్రముఖ తెలుగు వెబ్‌సైట్లు ప్రచురించి కథనాలు కనిపించాయి. ఈటీవీ ఆంధ్రప్రదేశ్ యూట్యూబ్ ఛానెల్లో ఓ వీడియో కూడా కనిపించింది.
ఇంగ్లిష్‌లో సెర్చ్ చేయగా.. West Bengal announces Telugu as official language of state అనే హెడ్డింగ్‌తో ఈటీవీ భారత్ వెబ్‌సైట్లో ప్రచురితమైన కథనం కనిపించింది. ఈ కథనాలన్నీ 2020 డిసెంబర్ 23న ప్రచురితం అయ్యాయి. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ముందు టీఎంసీ అధినేత్రి, సీఎం మమతా బెనర్జీ.. ఆ రాష్ట్రంలో తెలుగు ప్రజలు కానుకగా తెలుగును అధికార భాషగా ప్రకటించారు. డిసెంబర్ 22న ఆమె ఈ ప్రకటన చేశారు.
బెంగాల్‌లోని ఖరగ్‌పూర్‌లో పెద్ద సంఖ్యలో తెలుగు వాళ్లు ఉంటున్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం ఖరగ్‌పూర్‌లో 55.39 శాతం మంది బెంగాలీ మాట్లాడే వారు ఉండగా.. ఆ తర్వాతి స్థానంలో 12.78 శాతం తెలుగు మాట్లాడే జనాభా ఉన్నారు. 10.65 శాతంతో హిందీ మూడో స్థానంలో నిలిచింది. ఖరగ్‌పూర్ తెలుగు పాఠశాలలు కూడా ఉన్నాయి. ఖరగ్‌పూర్ తెలుగు విద్యాపీఠం హైస్కూల్‌ను దేశానికి స్వాతంత్య్రం రాకముందు 1944లోనే స్థాపించడం గమనార్హం. 2011 జనాభా లెక్కల ప్రకారం బెంగాల్‌లో 88,352 మంది తెలుగు మాట్లాడే వారున్నారు. తెలుగును అధికార భాషగా గుర్తించడానికి ముందే.. బెంగాల్‌లో బెంగాలీతోపాటు ఇంగ్లిష్, నేపాలీ, ఉర్దూ, సంతాలీ, హిందీ, ఒడియా, పంజాబీ, రాజ్‌బంగ్షీ, కాంతాపూరి, కుర్మాలీ, కురుఖ్ అధికార భాషలుగా ఉన్నాయి.
అసలు వాస్తవం ఇది....?
తెలుగుకు అధికార భాష హోదా కల్పిస్తున్నట్లు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ 2020 డిసెంబర్లో ప్రకటన చేసినట్లు మీడియాలో కథనాలను సజగ్ టీమ్ గుర్తించింది. దీన్ని బట్టి ఎక్స్‌లో యూజర్ చేసిన పోస్టు నిజమేనని తేల్చింది.