దక్షిణ కొరియాలో విమానం పేలిన ఘటనలో 179 మంది దుర్మరణం పాలయ్యారు. ఆ విమానంలో ప్రయాణిస్తున్న ఇద్దరు మాత్రమే సురక్షితంగా ప్రాణాలు దక్కించుకున్నారు. మరికొన్ని క్షణాల్లో ల్యాండింగ్ కావాల్సిన ఆ విమానం రన్ వే పై అదుపు తప్పి.. గోడను ఢీకొట్టడంతో పేలుడు సంభవించింది. దీంతో ఆ విమానంలో మంటలు చెలరేగడంతో ప్రయాణికులతో కాలి బూడిదయ్యారు. ప్రమాదం జరిగిన వెంటనే అలర్ట్ అయిన రెస్క్యూ సిబ్బంది.. ఇద్దరిని సురక్షితంగా కాపాడారు. మిగిలిన వారి ప్రాణాలు మాత్రం కాపాడలేకపోయారు. ఇక ల్యాండింగ్ గేర్ విఫలం కావడంతోనే ఈ విమానం అదుపు తప్పి రన్ వేపై దూసుకువెళ్లి ప్రమాదానికి గురైనట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. దీనిపై దర్యాప్తు చేపట్టిన అధికారులు.. తదుపరి చర్యలు చేపడుతున్నారు.
థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్ నుంచి దక్షిణ కొరియాకుని బయల్దేరిన "ది జేజు" ఎయిర్ ఫ్లైట్‌కు చెందిన 7C2216 నంబర్ బోయింగ్ 737-800 విమానం.. ముయాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయ్యే సమయంలో అదుపు తప్పింది. దీంతో రన్ వేపై అతివేగంగా దూసుకెళ్లి ఎయిర్‌పోర్టు రక్షణ గోడను ఢీకొట్టడంతో పేలుడు సంభవించింది. ఇక విమానాన్ని ల్యాండ్ చేసేందుకు పైలట్ ప్రయత్నించగా.. ల్యాండింగ్ గేర్ పనిచేయలేదని.. ఈ సమస్య కారణంగానే విమానం ప్రమాదానికి గురైనట్లు అధికారులు అనుమానిస్తున్నారు.
ల్యాండింగ్‌కు ప్రయత్నించిన సమయంలో.. ల్యాండింగ్ గేర్ పనిచేయకపోవడంతో.. రన్‌వే పై దిగిన తర్వాత విమానం స్పీడును పైలట్ కంట్రోల్ చేయలేకపోయారని అధికారులు పేర్కొన్నారు. ఎయిర్‌పోర్టు గోడను ఢీకొనడంతో విమానంలో ఇంధనం ఒక్కసారిగా మండడంతో మంటలు వ్యాప్తి చెందినట్లు తెలిపారు. అయితే విమానం ల్యాండ్ అయిన సమయంలో ల్యాండింగ్ గేర్, టైర్లు పనిచేయ లేదని కొందరు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. అయితే ఏదైనా పక్షిని ఢీకొనడం వల్లే ల్యాండింగ్ గేర్, టైర్లు తెరుచుకోవడంలో సమస్య ఏర్పడి ఉండవచ్చని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. విమానం ల్యాండింగ్ అయ్యే సమయంలో ఇంజిన్ నుంచి ఒక్కసారిగా నిప్పులు బయటికి వస్తున్నట్లు ఉన్న ఓ వీడియో వైరల్ కావడంతో అదే అనుమానం బలపడుతోంది.
ఇక ఆ విమానంలో 175 మంది ప్రయాణికులు, ఆరుగురు విమాన సిబ్బంది సహా మొత్తం 181 మంది ప్రమాద సమయంలో ఉండగా.. అందులో 179 మంది మృతి చెందారు. ఇద్దరు మాత్రమే ప్రాణాలతో బయటపడినట్లు తెలిపారు. ఆ ఇద్దరిలో ఒకరు ప్రయాణికుడు కాగా.. మరొకరు ఎయిర్‌లైన్స్ సిబ్బంది అని అధికారులు వెల్లడించారు. ఇక ఈ ప్రమాదంలో విమానం పూర్తిగా కాలిపోయిందని అధికారులు తెలిపారు. ఈ విమాన ప్రమాదంతో ముయాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో అన్ని విమానాల రాకపోకలను రద్దు చేశారు.