ల్యాండింగ్ సమయంలో టెక్నికల్ సమస్య కారణంగా గోడను ఢీకొట్టి పేలిపోయిన ఘటన దక్షిణ కొరియాలో సంచలనంగా మారింది. అయితే ఇటీవల కజకిస్తాన్‌లో ల్యాండింగ్ సమయంలో విమానం కూలిపోయి పదుల సంఖ్యలో ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయిన ఘటన జరిగిన రోజుల వ్యవధిలోనే మరో విమాన ప్రమాదం జరగడం విమాన ప్రయాణికులకు తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. అయితే తాజాగా జరిగిన దక్షిణ కొరియా విమాన ప్రమాదానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇక ప్రమాదానికి కొన్ని క్షణాల ముందు వీడియో బయటికి రావడంతో.. అందులో విమాన ప్రమాదానికి కారణం ఓ పక్షి అని దక్షిణ కొరియా స్థానిక మీడియా కథనాలు వెలువరిస్తోంది.
బ్యాంకాక్ నుంచి వచ్చిన జెజు ఎయిర్‌లైన్ సంస్థకు చెందిన బోయింగ్ 737 విమానం.. దక్షిణ కొరియాలోని మువాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అవుతున్న సమయంలో ప్రమాదానికి గురైంది. విమానంలోని ల్యాండింగ్ గేర్ పనిచేయకపోవడంతో.. ఆ విమానం రన్‌వేపై అదుపు తప్పి.. ముందు ఉన్న గోడను ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా పేలిపోవడంతో విమానంలో మంటలు చెలరేగి.. కొందరు ప్రయాణికులు అగ్నికి ఆహుతి అయ్యారు. ఇక ప్రమాద సమయంలో ఆ విమానంలో 175 మంది ప్రయాణికులు, ఆరుగురు విమాన సిబ్బందితో కలిపి మొత్తం 181 మంది ఉన్నారు. అయితే ఈ ఘోరమైన విమాన ప్రమాదం పక్షుల దాడి కారణంగానే జరిగిందని తెలుస్తోంది.
ల్యాండింగ్ వేళ పక్షులు విమానాన్ని ఢీకొనడంతో.. ల్యాండింగ్ గేర్ చెడిపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పేర్కొంటున్నారు. దీనికి సంబంధించిన వీడియో కూడా ఇప్పుడు వైరల్ అవుతోంది. విమానం ల్యాండ్ కావడానికి ముందు.. ఏదో ఒకటి దానికి తగిలి.. పేలిపోయినట్లు ఆ వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. అది ఓ పక్షి అని.. విమానాన్ని తాకడంతో ల్యాండింగ్ గేర్ పనిచేయలేదని పేర్కొంటున్నారు. అయితే దీనికి సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
ఇక ఈ విమాన ప్రమాదానికి సంబంధించి రెస్క్యూ సిబ్బంది శ్రమిస్తున్నారు. దక్షిణ కొరియా ప్రభుత్వం అగ్నిమాపక శాఖ, పోలీసు, ఇతర ఎమర్జెన్సీ టీమ్‌లను ఘటన స్థలానికి పంపించింది. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతుండగా.. కొందరిని ప్రాణాలతో బయటికి తీస్తున్నారు. ఇప్పటివరకు 62 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. అయితే మృతుల సంఖ్య మరితం పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. 2005లో ప్రారంభమైన ఈ జెజు ఎయిర్‌లైన్ సంస్థ ఆసియాలోని అనేక దేశాలకు విమాన సేవలను అందిస్తోంది.
స్పందించిన దక్షిణ కొరియా అధ్యక్షుడు
ఇక ఈ విమాన ప్రమాదంపై దక్షిణ కొరియా తాత్కాలిక అధ్యక్షుడు చోయ్ సాంగ్ మోక్ స్పందించారు. ఈ ప్రమాదానికి సంబంధించి అన్ని సహాయక చర్యలను వేగంగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. దక్షిణ కొరియా రాజధాని సియోల్ నుంచి 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న మువాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టును ఆయన స్వయంగా చేరుకుని పరిశీలించనున్నారు.